డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం.
GHMC పరిధిలో అనేక బిల్డింగ్స్ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్నాయి. కొన్ని నిబంధనలకు తగ్గట్టు నిర్మాణం జరుగుతుండగా.. మరికొన్ని పొందిన అనుమతుల కంటే ఎక్కువ ఫ్లోర్ల నిర్మాణం జరుగుతున్నాయి. మరి కొన్ని బిల్డింగ్లు నాలలు, చెరువుల పరిసరాల్లో.. అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మాణం జరుగుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలకు సుమారు మూడు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఈ ఇద్దరి మృతదేహాల గుర్తింపు కోసం హిడ్మా అన్నకు, రాజే తమ్ముడికి వైద్యులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. మిట్ట పల్లూరు గ్రామానికి చెందిన రామ్మూర్తి రెడ్డి గొల్లపల్లి వద్ద ఓ ఢాబాలో రొట్టెలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన నరసింహరాజు, పేటకు చెందిన రవితో కలిసి నడిరోడ్డుపై రామ్మూర్తిరెడ్డి గొంతు కోశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేస్తామన్నారు.
2015-16 గ్రూప్-2 రద్దుపై అప్పీలుకు వెళ్లాలని TGPSC భావిస్తోంది. ఇటీవల గ్రూప్ 2 సెలక్షన్ జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కమిషన్ పరిశీలించింది. గత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఫలితాలు వెల్లడించినందున, దీనిపై అప్పీలు దాఖలు చేసేందుకు నిర్ణయించుకుంది TGPSC.
పెనమలూరులోని ఓ ఇంట్లో అరెస్టయిన 24 మంది మావోయిస్టులకు 13 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అరెస్టైన 28 మంది మావోయిస్టుల్లో మరో నలుగురిని వయసు నిర్ధారణ కోసం ప్రభుత్వాస్పత్రిలో మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది కోర్టు. మెడికల్ టెస్టుల అనంతరం విచారణ జరుపుతామని తెలిపారు జడ్జి.
కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. బిక్కనూర్ మార్కెట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన, ఇల్చిపూర్ వృద్ధాశ్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ఎస్సై వేణు కుమార్‌పై బదిలీ వేటు పడింది. రెండు రోజుల క్రితం ఓ కేసు విషయంలో మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు ఎస్సై. ఫిరోజ్‌పై ఎస్సైతోపాటు మరికొందరు సిబ్బంది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కాళ్లు చేతులపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఫిరోజ్ అస్వస్థతకు గురయ్యారు.
దేశంలో భయానక వాతావరణం కన్పిస్తోందన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్నారని.. చిత్ర హింసలు పెట్టి చంపుతున్నారని ఫైరయ్యారు. ఇందుకు హిడ్మా ఎన్‌కౌంటరే నిదర్శనమన్నారు కూనంనేని.
హైదరాబాద్ అనుమానిత ఉగ్రవాది మోహినుద్దీన్ సయ్యద్‌పై ముగ్గురు ఖైదీలు దాడి చేశారు. ఉగ్రవాద లింకులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో రాజేంద్ర నగర్‌లో సయ్యద్ మొహినుద్దీన్‌ను గుజరాత్ ఏటీఎస్ బృందం అరెస్ట్ చేసింది. రెసిన్ అనే ప్రాణాంతక రసాయన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
ఐబొమ్మ కేసులో అరెస్టయిన ఇమంది రవి కస్టడీకి అనుమతి లభించింది. ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. వారం రోజుల పాటు ఐబొమ్మ రవి కస్టడీని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటికే ఐబొమ్మ రవి కేసు పై ఈడి సైతం ఫోకస్ పెట్టింది.
హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు లిఫ్ట్ డోర్‌లో బాలుడు ఇరుక్కుపోయాడు. దీంతో బాలుడు బయటకు రాకముందే లిఫ్ట్ డోర్ లాక్ అవ్వడంతో చనిపోయాడు.
నేడు బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.
బెంగళూరులో పట్టపగలే నడిరోడ్డుపై భారీ చోరీ జరిగింది. పన్ను అధికారులమంటూ వచ్చిన దుండగులు.. ఏడు కోట్ల రూపాయలతో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. స్పెషల్ టీమ్స్‌తో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శబరిమలకు భారీగా పెరుగుతున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా, కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నవంబర్ 24 వరకు రోజుకు వర్చువల్ క్యూ ద్వారా 70 వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఉండనుంది.
ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ AQI 400 పాయింట్లకు పైగా క్షీణించడంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. చాందినీ చౌక్, ఆనంద్ విహార్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో NCR పరిధిలోని పాఠశాలల్లో జరగాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేయాలని CPCBని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మహిళల పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా వచ్చే నెలలో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లడం లేదని, దానికి బదులుగా ప్రత్యామ్నాయ సిరీస్ ఏర్పాటు చేయడానికి ఇతర బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి నటనకు అధికారికంగా రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు ప్రకటించారు సీనియర్ నటి తులసి. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ ద్వారా తెలిపారు. రిటైర్‌మెంట్ తర్వాత తన జీవితాన్ని షిరిడీ సాయిబాబా సేవకు అంకితం చేస్తానని, ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు.
జపాన్‌లో మన సినిమాలు సత్తా చాటుతున్నాయి. అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన బాహుబలి మొదలుకొని, కల్కి 2898 ఏడీ వరకూ జపాన్‌లో విడుదలై మంచి ఆదరణని సొంతం చేసుకున్నాయి. అక్కడ ప్రభాస్‌కి బలమైన అభిమాన గణం ఏర్పడింది. ‘కల్కి’ విడుదల సమయంలోనే తన అభిమానులను పలకరించేందుకు జపాన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.