తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యులు అప్పాసి నారాయణ, ఎర్రాల సహా మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ఇండస్ట్రీయల్ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. నాటి కేసీఆర్ ప్రభుత్వమే ఆర్థిక అరాచకాలకు పాల్పడిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రేటర్ విశాఖ పరిధిలోని రోడ్లను ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 88 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కౌన్సిల్ తీర్మానించింది. పీపీపీ మోడల్‌లో రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అధికారులు చూస్తున్నారు. రోడ్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల జీవీఎంసీ ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.
యాంకర్ శివజ్యోతి వివాదంలో ఇరుక్కున్నారు. తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నామంటూ కామెంట్ చేశారు. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం అంటూ..మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శివజ్యోతిపై భక్తులు, హిందూ సంఘాల నాకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి విజయానంద్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉంది. ప్రభుత్వం ఉత్తర్వులతో చీఫ్ సెక్రటరీ కుర్చీపై ఉత్కంఠకు తెరపడింది. 2026 ఫిబ్రవరి వరకు ఆయన సీఎస్‌గా కొనసాగనున్నారు.
అమరావతిలో పలు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో కొండవీటి వాగు, గుంటూరు చానెల్, బకింగ్ హాం కెనాల్స్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జిలను మంత్రి పరిశీలించారు. కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వేగవంతం చేయాలన్నారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ బహిరంగ సవాల్ విసిరారు. వనభోజనాల్లో సుభాష్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని, రాని పక్షంలో కులానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, జీవోలు, రైతులకు జరిగిన మేలు కీడుపై చర్చిద్దాం అని వేణుగోపాలకృష్ణ సవాల్ చేశారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెంగళూరులో జరిగిన ఏటీఎం చోరీ నేపథ్యంలో కుప్పం కూర్మానిపల్లిలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక పోలీసులు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేశారు. పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. నడిరోడ్డుపై కేక్ కట్ చేసి తల్వార్ తిప్పుతూ విన్యాసాలు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బర్త్‌డే బాయ్ కల్యాణ్‌తో పాటు అతని స్నేహితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విధులలో నిర్లక్ష్యం వహించినందుకు జగన్మోహన్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈవో రంగనాయుడు చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు డీఈవో.
తిరుమల పరాకామణి కేసు దర్యాప్తులో సీఐడీ అధికారులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో నిన్న పరాకామణి మాజీ డిప్యూటీ ఈవో, ఎస్టేట్ అఫీసర్‌గా పని చేసిన మల్లికార్జున, సీసీ కెమెరా యూనిట్ అపరేటర్ చంద్ర, గార్డు రామచంద్ర, వీవో సుబ్బరాజులను విచారించారు. ఒక్కొక్కరిని నాలుగు గంటల పాటు విచారించిన సీఐడీ.. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. వైజాగ్ మహిళ యమునకు కిడ్నీ తొలగిస్తుండగా ఆమె ఫిట్స్ వచ్చి మరణించింది. భర్త ఫిర్యాదుతో గ్లోబల్ అసుపత్రి డాక్టర్ శాశ్వత,ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ల పని చేసే కూమార్ నాయక్, బాలులను మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. జాతీయ రహదారిపై రోడ్డు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించారు. వాకర్స్ కూడా పొగ మంచులోనే నడుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు.
బిహార్‌లో సీఎం నీతీశ్ కుమార్ సారథ్యంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు చేపట్టారు. మంత్రిత్వశాఖల కేటాయింపుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను సీఎం నీతీశ్ వదులుకున్నారు. అత్యంత కీలకమైన ఈ శాఖను డిప్యూటీ సీఎం నీతీశ్ సామ్రాట్ చౌధరికి కేటాయించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే తన ప్రతిపాదన శాంతిని నెలకొల్పేందుకు మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పీస్ ప్లాన్‌ను జెలెన్‌స్కీ ఏదో ఒక సమయంలో అంగీకరించాల్సిందేనని చెప్పారు. యుద్ధం సిగ్గుచేటని.. తాను అధికారంలో ఉండుంటే యుద్ధం మొదలయ్యేది కాదని ట్రంప్ అన్నారు.
అమెరికా ప్రతిపాదించిన పీస్ ప్లాన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ చరిత్రలో అత్యంత ప్రమాదకర పీరియడ్స్‌లో ఒకదాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. మనం ఎంచుకునే దాన్ని బట్టి గైరవం, స్వేచ్ఛను కోల్పోవడమో, అమెరికా మద్దతు చేజార్చుకోవమో జరుగుతుందని తెలిపారు.
స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడు గేమ్‌లో కలిలోవాపై శ్రీజ శేషాద్రి గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. దీంతో పూల్-బిలో నాలుగో స్థానంలో నిలిచి భారత్ నాకౌట్ చేరింది.
గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో ఇండియా రెండో టెస్ట్‌లో తలపడనుంది. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమ్ ఇండియా, సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో సౌతాఫ్రికాతో పోరుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టెంబా బావుమా అర్ధశతకం సౌతాఫ్రికా విజయానికి దోహదపడ్డాయి.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం ట్రైలర్ రిలీజ్ అయింది. కర్ణాటకలో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ చేసిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది.
కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇది లాంఛనంగా మొదలై చాలా రోజులైనా ఇంకా చిత్రీకరణ మొదలు కాలేదు. వెంకీ ప్రస్తుతం చిరంజీవి- అనిల్ రావిపూడి సినిమాని పూర్తి చేయడంపై దృష్టి సారించడమే దీనికి కారణం. డిసెంబర్ రెండో వారం నుంచి త్రివిక్రమ్ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.