తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది బదిలీ చేసింది. మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, నార్కొటిక్ ఎస్పీగా పద్మను బదిలీ చేసింది. సౌత్‌జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గే, టాస్క్‌ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, సీఐడీ డీజీగా పరిమళ నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతనను బదిలీ చేసింది ప్రభుత్వం
కడప జిల్లా బద్వేల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడెం – గుంతపల్లి మార్గమధ్యలో కారు బోల్తా కొట్టడంతో స్పాట్‌లోనే వృద్ధురాలు పెద్ద లక్ష్మమ్మ మృతి చెందగా.. పలువురికి కాయాలన్నాయి. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉన్నది. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
జనగామ జిల్లా పాలకుర్తిలో ఇరిగేషన్ అధికారి ఏసీబీకి చిక్కారు.10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇరిగేషన్ డీఈ సంధ్యారాణి మిషన్ భగీరథ కాంట్రాక్టర్ వద్ద 10 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
హైదరాబాద్‌లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలోని మొదటి అంతస్తు గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గదిలోని సామగ్రి పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రెడ్డినగర్ కెనాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీమకుర్తి నుంచి ఒంగోలు వెళుతున్న గ్రానైట్ కంటైనర్ ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి రెండో రోజు విచారణ ముగిసింది. రెండోరోజు పలు కీలక అంశాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టారు. అంతేకాదు.. రవికి సినిమాలు సప్లై చేసినవారి వివరాలు కూడా సేకరించారు. ప్రధానంగా క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ వారికి రవి డబ్బులు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
వరంగల్ నగరంలో తొలిసారిగా హాఫ్ మారథాన్ వేడుకలు ఈనెల 23న కాళోజీ కళాక్షేత్రం వద్ద ప్రారంభం కానున్నాయి. క్రెడాయ్ సౌజన్యంతో తెలంగాణ, వరంగల్ రన్నర్స్ అసోసియేషన్ దీనిని నిర్వహిస్తోంది. మూడు విభాగాల్లో జరిగే ఈ మారథాన్ కోసం ఇప్పటివరకు 2600 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం దేవునిగుట్ట తండాలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు 24 గంటల్లోనే పెచ్చులుగా ఊడిపోయింది. నాసిరకం పనులపై నిలదీసిన తండావాసులను కాంట్రాక్టర్ బెదిరించారు. అధికారులు, కాంట్రాక్టర్ల అవినీతి వల్లే ఈ విధంగా నాణ్యతలేని నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
భద్రాద్రి చర్ల మండలంలోని కలివేరు వద్ద ప్రధాన రహదారిపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసిన పోడు భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని నిరసనకు దిగారు. పోడు భూములకు రక్షణ కల్పించి, దౌర్జన్యం చేస్తున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు అక్రమ గంజాయి రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవాళ, రేపు 5వ కామన్‌వెల్త్ AI గ్లోబల్ సమ్మిట్ అవార్డుల వేడుక వైభవంగా జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. 56 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ చారిత్రాత్మక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జి, ఇతర ప్రముఖులు హాజరై రైజింగ్ తెలంగాణ కీర్తిని పెంచనున్నారని అన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో.. పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐ దర్యాప్తు చేయకపోతే తనతో పాటు ఆదినారాయణ రెడ్డికి లింక్ పెట్టేవారన్నారు. ఇదే విషయం నాటి జిల్లా ఎస్పీ తనతో చెప్పినట్లు వెల్లడించారు. వివేకా కేసు విషయంలో ఆదేశాలు కూడా ఎస్పీకి వచ్చాయన్నారు.
ఢిల్లీ పేలుడు కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కీలక నిందితుడు డాక్టర్ ఉమర్ నబీకి బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్ నుంచి వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్ హ్యాండ్లర్ ఈ వీడియోలను పంపినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా మొత్తం 42 వీడియోలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
దేశానికి ఎంత చేయగలనో అంతా చేశానన్న పూర్తి సంతృప్తితోనే పదవీ విరమణ చేస్తున్నానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. నాలుగు దశాబ్దాలపాటు న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పని చేసిన తాను ప్రయాణం ముగింపులో మళ్లీ న్యాయ విద్యార్థిగానే వెళ్తున్నానని తెలిపారు. పదవీ విరమణ చేయనున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌కు శుక్రవారమే చివరి పనిదినం.
రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీని నేపథ్యంలో భారత్, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో ఆ దేశ చమురు ధరలు పతనమైనట్లు ట్రెజరీ శాఖ సీనియర్ అధికారి విలేకరులతో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న నిధులపై ఒత్తిడి పెరిగిందన్నారు.
థాయ్‌లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్-2025 పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ విజేతగా నిలిచింది. గతేడాది మిస్ యూనివర్స్‌గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్.. ఫాతిమాకు అందాల కిరీటాన్ని అందజేశారు. దాదాపు 120 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొనగా.. వారందరినీ వెనక్కినెట్టి ఈ 25 ఏళ్ల ఫాతిమా.. మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది.
భారత స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె ప్రియుడు పలాశ్ ముచ్చల్, ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన ముంబై డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని ఉంగరంతో మంధానకు ప్రపోజ్ చేశారు. ఈ మధుర క్షణాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాటల హంగామాని షురూ చేయబోతున్నాడు ‘ది రాజాసాబ్’. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలోని తొలి పాటని ఈనెల 23న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. రెబల్‌సాబ్ అంటూ సాగే ఈ పాట కలర్‌ఫుల్‌గా ఉండబోతోందని చిత్రబృందం విడుదల చేసిన లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.