హనుమకొండలో హాఫ్ మారథాన్ ఫస్ట్ ఎడిషన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గతంలో లేని విధంగా క్రీడాకారులను ఇప్పుడు ప్రోత్సహిస్తున్నామని, వరంగల్‌లో 4వ స్పోర్ట్స్ స్కూల్‌ను మంజూరు చేశామన్నారు. యువత మత్తు పదార్థాలు వదిలి, మైదానంలోకి అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు.
విశాఖపట్నం నగరంలోని తాడిచెట్లపాలెం ప్రాంతంలో కలకలం సృష్టించిన పసికందు హత్య కేసు మిస్టరీ వీడటం లేదు. హంతకులు ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యంత పక్కా ప్రణాళికతో హత్య చేసి, చిన్నారి శరీర భాగాలను డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుల కోసం కంచరపాలెం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సగెంకర్దు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమార్తె అవంతి పెళ్లి సామాగ్రి కొని తిరిగి వస్తుండగా తండ్రి అనంతప్ప బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. పెళ్లి టెంట్ కిందే తండ్రి మృతదేహం ఉంచాల్సిన విషాద ఘటన నెలకొంది.
ఏపీలో జరిగిన ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చర్ల అటవీ ప్రాంతంలో కాంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, భద్రాచలం-చింతూరు మార్గంలో ఆర్టీసీ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.
హయత్‌నగర్‌లోని సైదా పైల్స్ క్లినిక్‌లో దారుణం చోటుచేసుకుంది. సరైన అవగాహన లేని డాక్టరు చేసిన శస్త్రచికిత్స వికటించించి ఓ మైనర్ యువకుడు మృతి చెందాడు. దీంతో బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న క్లినిక్‌లో జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు గల్లంతయ్యారు. వుడా పార్కు లైట్‌హౌస్ సమీపంలో ఎనిమిది మంది స్నేహితులు బీచ్‌కు వచ్చారు. వీరిలో నలుగురు స్నానానికి సముద్రంలోకి దిగారు. రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ అనే ఇద్దరు విద్యార్థులు రాకాసి అలల్లో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. తేజస్ మృతదేహం లభ్యం కావడంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారామ్‌పూర్ రెవెన్యూ పరిధిలోని పారిశ్రామిక కారిడార్‌లో రోడ్డుకు ఇరువైపులా నాటాల్సిన మొక్కలను అధికారులు గాలికి వదిలేశారు. లక్షల రూపాయలు వెచ్చించి వర్షాకాలంలో నాటాల్సిన మొక్కలను నాటకుండా పక్కన పడేయడంతో అవి పూర్తిగా ఎండిపోయాయి. పనులు సక్రమంగా నిర్వహించకుండా.. ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరులో సివిల్ కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపారు. బంగారు వ్యాపారి శ్రీనివాసులును అప్పుల వ్యవహారంలో బలవంతంగా ఎత్తుకెళ్లి, ప్రైవేటు ఎస్టేట్‌లో బంధించారు. వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి, విజయవాడ సీఐ వసంతలు ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో కలకలం రేగింది. బాధితుడు ఇంటికి తిరిగి వచ్చాక, తన ఆస్తి డాక్యుమెంట్లు, దుకాణం తాళాలు తీసుకువెళ్లారని ఆరోపించారు.
విజయవాడ సింగ్ నగర్‌లో ‘డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ ర్యాలీని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం కాకుండా ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగస్వామ్యం కావాలని డీజీపీ పిలుపునిచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మనోవేంద్ర రావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, సినీ నటి నిక్కీ గల్రానీ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు అందిస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సామాన్యుడికి, ప్రధానికి ఒకటే న్యాయం అని గుర్తు పెట్టుకోవాలన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం మండలంలో జరిగిన పలు అభివృధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుంచి కోర్ట్‌కి వెళ్లని జగన్ తన అనుచర గణంతో ఇప్పుడు కోర్ట్‌కి వెళ్లడం న్యాయస్థానాన్ని గౌరవించినట్టే నా అని ప్రశ్నించారు. కోర్టు జగన్‌కి టైమ్ ఇచ్చినట్లు లేదు… జగనే కోర్ట్‌కి టైమ్ ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు.
పల్నాడు జిల్లా రెంటచింతల బయో డీజిల్ బంక్‌లో షార్ట్ సర్క్యూట్ తో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గురజాల ప్రాంతానికి చెందిన రషీద్ మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా షేర్‌మామపేటలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మంగోల్ ప్రాంతంలోని చాపల చెరువు పక్కన పంట పొలం కాలువలో కాపలా ఉన్న వ్యక్తి మృతదేహాన్ని చూసి పోలీసులు సమాచారం అందించారు. దీంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని బాడీని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాక్ కేంద్రం పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వైట్-కాలర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా బాంబు దాడులకు కుట్ర పన్నినట్లు తాజాగా దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజామ్మిల్ షకీల్, ఉమర్ మహమ్మద్ నబీ వంటి నిందితులు రెండేళ్లుగా పేలుడు పదార్థాలు, రసాయనాలు సేకరించి, దాడులకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ కుట్రలో విదేశీ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి.
కర్ణాటకలో అధికార, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే అంతిమమని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సుమారు గంటకు పైగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
భారత్‌తో స్నేహం కలకాలం ఉండాలని ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన జీ-20 సదస్సులో మోదీతో సమావేశం అనంతరం ఆయన ఇరుదేశాల మధ్య ఉన్న బంధం గురించి సోషల్ మీడియా వేదికగా మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకల్లో అమరన్ చిత్రం ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్ కు గౌరవ మైలురాయి అయింది.
నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘వృషకర్మ’. ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. చైతన్య ఫస్ట్‌లుక్‌తో కూడిన టైటిల్ పోస్టర్‌ను మహేశ్ బాబు సోషల్ మీడియాలో విడుదల చేశారు. చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లుక్ బాగుందన్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2025-26 కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ని ఎంపిక చేసింది. అయితే.. ఈ టోర్నీ మొత్తానికి సంజూ అందుబాటులో ఉండకపోవచ్చు.. కేవలం గ్రూపు స్టేజిలో మాత్రమే ఆడనున్నాడని తెలుస్తోంది. (కెప్టెన్‌గా సంజూ)