E-Paper
Advertisement

Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?

Top 20 News Today: ఘోర రైలు ప్రమాదం..11 మంది రైల్వే కార్మికులు మృతి, నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?

1. నాగబాబుకి మంత్రి పదవి లేనట్టేనా..?

ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి లేనట్టే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే.. జనసేనలో ఇతర సామాజిక వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉండగా.. మూడో పదవి ఇవ్వడంపై పార్టీలో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

2. కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

కల్తీ నెయ్యి కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య తయారైనవన్నీ కల్తీ లడ్డూలే అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రసాదంలో వెజిటెబుల్ ఫ్యాట్ కలిసిందని తొలుత టీటీవీ ఈవో చెప్పారు.. కాదు, జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ లడ్డూ ప్రసాదంలో కలిసింది ఏంటనేది ఇప్పటికీ తెలియలేదన్నారు వైవీ సుబ్బారెడ్డి.

3. గ్రూప్-2 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలో 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా.. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

4. తెలంగాణ డీజీపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

లక్డీకాపూల్‌లో డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి యత్నించారు అయ్యప్ప స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన స్వాములను అడ్డుకున్నారు పోలీసులు. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీస్ ఉద్యోగుల పట్ల.. తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఈ ముట్టడికి వచ్చారు.

5. భూమనపై రామయ్య చేసిన ఆరోపణలపై విచారణ చేయాలి..

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనపై వర్ల రామయ్య చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని డీజీ రవిశంకర్‌ను కోరారు. రవికుమార్ ఆస్తులు తాను రాయించుకున్నానని రామయ్య ఆరోపణలు చేస్తున్నారని.. దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని భూమన విజ్ఞప్తి చేశారు.

6. తిరుమలలో నిలిపివేసిన చిన్న వెంకన్న ఆలయం పునఃప్రారంభం

కొవిడ్ కారణంగా ద్వారకా తిరుమలలో నిలిపివేసిన చిన్న వెంకన్న అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు తిరిగి ప్రారంభించారు. ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త అయ్యంగర్ వరుస ఫిర్యాదుల మేరకు భక్తులకు ఈ దర్శనం అవకాశం కల్పించారు.

7. అయ్యయ్యో.. మోసపోయిన బంగారం షాపు ఓనర్..

ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నకిలీ బంగారంతో గోల్డ్ షాపు యజమాని మధుసూదన రావును ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. 28 గ్రాముల నకిలీ బ్రాస్‌లెట్ తాకట్టు పెట్టి 1 లక్ష 5 వేలు తీసుకున్నారు. అది నకిలీదని తెలిసి మోసపోయిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

8. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులు మరపడవల పోటీలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్పలో మత్స్యకారులు మరపడవల పోటీలు నిర్వహించారు. గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే చోట ముందుగా లంగరు వేసిన వారికే ఆ స్థలంలో ఏడాది పాటు వేటాడే హక్కు దక్కుతుంది. ఈ పోటీలు ఆర్థిక బలం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

9. కాకినాడ జిల్లాలో యువకులు బైక్ విన్యాసాలతో హల్‌చల్

కాకినాడ జిల్లా జె.కొత్తూరు గ్రామంలో యువకులు ప్రమాదకరమైన బైక్ విన్యాసాలతో హల్‌చల్ చేశారు. ఒకే బైక్‌పై ఐదుగురు యువకులు.. ఒకరు నడుపుతుండగా, ముగ్గురు వెనుక, మరొకరు ట్యాంక్‌పై కూర్చుని నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని నడుపుతూ కెమెరాకు చిక్కారు. ఇలాంటి చర్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

10. రాష్ట్రంలో పులుల సంరక్షణకు ముందడుగు..

తెలంగాణ రాష్ట్రం పులుల సంరక్షణలో మరో ముందడుగు వేసింది. అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించారు. పులుల సంరక్షణతో పాటు, మనుషులు-పులుల మధ్య సంఘర్షణను తగ్గించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు.

11. గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల తొలి విడత నామినేషన్లు..

సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 119 గ్రామాలను 32 క్లస్టర్‌లుగా విభజించి ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టారు.

12. బ్రాహ్మణులను కించపరిచేలా పాటలు

పల్నాడు జిల్లా వినుకొండలో బ్రాహ్మణులను కించపరిచేలా పాటలు పాడుతున్న పల్లవోలు రమణ, జీడీ సారయ్యపై చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ చేసింది. సంప్రదాయాలను కించపరుస్తూ, కులాల మధ్య చిచ్చు పెట్టడం దారుణమన్నారు సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి శ్రీనివాసులు, టీడీపీ నేత సురేష్.

13. తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడద..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజారిటీ గ్రామాల్లో కోతుల బెడద తీవ్ర సమస్యగా మారింది. ఇవి మనుషులపై దాడి చేయడంతో పాటు పంటలను నాశనం చేస్తున్నాయి. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కోతులను తరిమివేస్తేనే ఓటు వేస్తామంటూ డిమాండ్‌ చేస్తున్నారు గ్రామస్తులు.

14. బీఆర్ఎస్‌లో చేరిన పలువురు కాంగ్రెస్ నేతలు

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు, శరత్ చంద్ర, అరవింద్ బాబుతో సహా పలువురు నాయకులు.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

15. దారుణం.. ఆసుపత్రిలో కిడ్నీ రోగి తీవ్ర ఆవేదన

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ రోగి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లింగంపేట గ్రామానికి చెందిన త్యాగల గంగారాం అనే కిడ్నీ పేషెంట్‌ను డయాలసిస్ కోసం అతని భార్య ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది. దిక్కుతోచని ఆ దంపతులు వైద్యం అందక గంటల తరబడి ఆసుపత్రి బెడ్‌పైనే రోదిస్తూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

16. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి బంపర్ ఆఫర్

వికారాబాద్ జిల్లా మతన్‌గౌడ్ గ్రామంలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి బంపర్ ఆఫర్ తగిలింది. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వేషన్‌గా ఖరారు కాగా, గ్రామంలో ఎస్టీ కుటుంబం ఒక్కటే ఉండటం విశేషం. ఎరుకలి భీమప్ప కుటుంబానికి సర్పంచ్ పదవితో పాటు, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు ఉన్న రెండు వార్డు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది.

17. ఘోర రైలు ప్రమాదం..

చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కున్నింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్ వద్ద రైలు.. ట్రాక్ ప్రాంతంలోకి ప్రవేశించిన కార్మికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది రైల్వే నిర్మాణ కార్మికులు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.

18. టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడానికి బ్యాటర్ల వైఫల్యమే కారణం-రవిచంద్రన్

దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని అన్నారు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. ముఖ్యంగా భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం.. స్వీప్ షాట్లు సరిగా ఆడకపోవడం పెద్ద సమస్య అని అశ్విన్ తెలిపారు.

19. తెరకెక్కుతున్న జైలర్ 2’ మూవీ

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో సేతుపతికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

20. ఓటీటీలోకి రాబోతున్న మరో కొత్త సినిమా..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘థామా’. అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే రెంట్ పద్దతిలో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×