పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీకే చెందిన ఛైర్‌పర్సన్ లక్ష్మీ తులసి షాక్ ఇచ్చారు. డస్ట్ బిన్‌ల కొనుగోలు నిధుల దుర్వినియోగంపై కౌన్సిలర్ ప్రశ్నించాడు. డబ్బులు అంబటి రాంబాబు వసూలు చేస్తే నన్నెందుకు అడుగుతారు? ఆయన్నే అడగండి అని ఛైర్‌పర్సన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ కౌన్సిలర్లు కంగుతిన్నారు.
సూర్యాపేట జిల్లా గుడిబండకు చెందిన పులి వెంకటేశ్వర్లు 37 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో పనిచేసి ఎస్సైగా రిటైర్ అయ్యారు. తన పుట్టిన ఊరి అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని గుడిబండ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో బరిలో ఉన్న తనను గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.
కర్నూలు జిల్లా గణేకల్లు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గణేకల్లును పెద్ద హరివనంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదోనిలో లేదా పెద్ద తుంబలంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు గ్రామస్తులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీకి ప్రసవం చేసిన డాక్టర్ నిర్లక్ష్యం వహించారు. శిశువు సగం బయటకు వచ్చిన స్థితిలో గర్భిణీ రెండు గంటలు నరకం అనుభవించారు. హార్ట్ బీట్ తక్కువగా ఉందని భద్రాచలం తరలించగా, శిశువు మార్గమధ్యలో మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని కేసు పెడతామని హామీ ఇచ్చారు.
నేటితో నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేష్, జోగి రాము కస్టడీ ముగియనుంది. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరికీ ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం, గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో చివరి రోజు విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయ్యాక జోగి బ్రదర్స్‌ను తిరిగి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో నేటి నుంచి రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జహీరాబాద్, ఝరాసంగం, మొగడంపల్లి, కోహిర్ మండలాల్లో మొత్తం 100 సర్పంచ్, 912 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 2, పోలింగ్ డిసెంబర్ 14న జరుగుతుంది.
42 శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, కేవలం 20 శాతం కూడా ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడాన్ని నిరసిస్తూ భువనగిరిలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పగిడ్యాలలోని నెహ్రూ నగర్‌లో ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా.. చేతన్ అనే రెండేళ్ల బాలుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. ఇంటి నిర్మాణం కోసం తెప్పించిన ఇటుకలు దింపిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ గుంటూరు జీజీహెచ్‌కు సాధారణ రోగిలా వచ్చి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓపీ చీటి తీసుకుని, క్యూలో నిలబడి మందులు తీసుకున్నారు. దాదాపు గంట తర్వాత అధికారులు ఆయనను గుర్తించారు. వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పీజీ వైద్య విద్యార్థి రోగులతో కఠినంగా మాట్లాడటాన్ని గమనించి మందలించారు.
మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని రాయలసీమ స్కూల్ వద్ద నడుపుతున్న కారులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకోగానే కారులో ఉన్న రఘునాథ్, అతని అక్క శ్రీదేవి అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
కోనసీమ జిల్లా మహిపాల చెరువు గ్రామంలో ఒక పెద్ద బ్లాక్ కోబ్రా హల్‌చల్ చేసింది. గ్రామస్తులు దానిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. చివరకు పాము పట్టుకునేవారి సహాయంతో దాన్ని సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాజీ జడ్పీటీసీ మొగతడకల లక్ష్మీ రమణి మొక్కు తీర్చుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కుకుని ద్వారకా తిరుమల నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేస్తున్నారు. జగ్గంపేట చేరుకోగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు నాగేంద్ర చౌదరి బృందానికి సహాయ సహకారాలు అందించారు.
భారీ వర్షాలకు శ్రీశైలం-హైద్రాబాద్ ఘాట్ రోడ్డులోని స్విచ్ యాడ్ డ్యామ్ సమీపంలో కొండచరియలు, బండరాళ్లు విరిగిపడటంతో జిల్లా ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ రాజకుమారి ఆదేశాలతో ఆర్డీవో ఆధ్వర్యంలో రెవెన్యూ, అటవీ, పోలీస్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులు విరిగిపడే కొండచరియలను అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడ్ అమల్లో ఉన్నా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్టిక్కర్లు, పోస్టర్లు ప్రభుత్వ బస్సులు, గోడలపై కనిపించాయి. వీటిని ఎన్నికల సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికార పార్టీకి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని నూతన బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదంలో కార్వాన్ పేటకు చెందిన అబ్దుల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ కాలనీకి చెందిన యువకులు ఇన్నోవా కారులో అధిక వేగంతో ప్రయాణించి స్కూటీని ఢీకొట్టింది. గాయపడిన అబ్దుల్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. జైరామ్ రమేష్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, మిథున్ రెడ్డి , సురేష్ రెడ్డి, బాలశౌరి, కమల్ హాసన్ సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది.
పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్‌కు ఉందన్నారు. మన్ కీ బాత్ 128వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘‘కష్టతరమైన వాటిని కూడా భారత్ సాధిస్తోంది. మహిళల అంధుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది’’ అని తెలిపారు.
టీమ్‌ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ మరో వన్డే రికార్డుకు చేరువయ్యాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేలో రోహిత్ 3 సిక్స్‌లు కొడితే, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది రికార్డును అధిగమించనున్నాడు. వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటాడు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ సొంతం చేసుకుంది ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో భూమాగా తన పాత్రతో రష్మిక అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పక సర్‌ప్రైజ్ చేస్తుందని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. వారి ఆదరణ వల్లే ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో పలకరిస్తానని తెలిపారు.