E-Paper
Advertisement

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

Top 20 News Today: హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సర్పంచ్ ఎన్నికల్లో సవాల్‌గా నిలిచిన అన్నదమ్ములు

1. తమిళనాడులోని పళనిలో తీవ్ర ఉద్రిక్తత

తమిళనాడులోని పళనిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల భక్తులపై స్థానిక వ్యాపారులు దాడి చేశారు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టాడు ఓ షాపు యజమాని. దీంతో షాపు వద్దకు భారీగా చేరుకున్న తెలుగు రాష్ట్రాల భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తెలుగు భక్తులపై చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. షాపు వద్దకు వస్తున్న వ్యాపారులు, భక్తులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా వ్యాపారస్తులకే సహకరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తమది పారదర్శకమైన ప్రజా ప్రభుత్వం అన్నారు. రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు.

3. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో నకిలీ ఉద్యోగులు

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో నకిలీ ఉద్యోగులున్నట్టు గుర్తించారు. కొందరు అవినీతి అధికారులతో కలసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల చేతి వాటం బయట పడింది. ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక తర్వాత చర్యలు తీసుకోనున్నారు. మంత్రులు, ఉన్నతాధికారుల పేషీల్లోనూ నకిలీ ఉద్యోగులున్నట్టు తెలుస్తోంది. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో బండారం బయటపడిందీ.

4. ఏడీ శ్రీనివాసులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

రంగారెడ్డి జిల్లా, సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కొత్తమ్‌ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి గురువారం ఏక కాలంలో AD శ్రీనివాసులు ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

5. నేడు కోర్టు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఇవాళ కోర్టు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కానున్నారు. పలు కంటెంప్ట్ పిటిషన్లలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆయనను హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 27న జరిగిన విచారణలోనే హాజరు కావాలని రంగనాథ్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే ఆబ్సెంట్ పిటిషన్ వేయడంపై గత విచారణలో కోర్ట్ అభ్యంతరం తెలిపింది. ఈసారి హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది.

6. శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఎమిరేట్స్ విమానం EK526కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు పంపిన మెయిల్‌లో… విమానాన్ని పేల్చివేస్తామని బెదిరించారు. ఈ సమాచారంతో అధికారులు అప్రమత్తమై, విమానం ల్యాండింగ్‌కు అత్యవసర ఏర్పాట్లు చేస్తున్నారు.

7. రోడ్లపై గుంపులుగా కూర్చున్న యువకులకు పోలీసులు కౌన్సెలింగ్

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రత్యేక చబుత్ర మిషన్ నిర్వహించారు పోలీసులు. రాత్రివేళ రోడ్లపై గుంపులుగా కూర్చున్న కొందరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రోడ్లపై రాత్రివేళ అనవసరంగా గడపవద్దని, భద్రత దృష్ట్యా ఇంటివద్దనే ఉండాలని పోలీసులు సూచించారు. ఎస్ఐ హాస్యప్రాయంగా కౌన్సిలింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో యువకులు ఇకపై ఇలాంటి పనులు చేయబోమని హామీ ఇచ్చారు.

8. నర్సంపేట సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో బీజేపీ నేతలు అరెస్ట్

వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. నేటి సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సీఎం క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

9. పదవ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి పదవ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. పాఠశాలలో నిర్వహించిన పోలీస్ కళా జాతర అవగాహన కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజినిపై పోక్సో కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ వారిద్దరినీ సస్పెండ్ చేశారు.

10. నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామ సర్పంచ్ ఎన్నికలలో అన్నదమ్ముల సవాల్

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు సవాలుగా నిలిచారు. అన్న కొమ్మ గోపాల్ బీఆర్ఎస్ మద్దతుదారుడు కాగా, తమ్ముడు కొమ్మ రాజు అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడుగా పోటీ చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం రక్తసంబంధం పక్కన పెట్టామని ఇద్దరూ తెలిపారు.

11. మెదక్ జిల్లాలో నామినేషన్ దాఖలు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ సతీమణి నగ్మా సుల్తానా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన సొంత గ్రామమైన బస్వాపూర్‌కు సేవ చేయాలనే లక్ష్యంతో పోటీలో నిలిచానని ఆమె తెలిపారు. గతంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది.

12. వీసీగా రమేష్ రెడ్డి

కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇంఛార్జ్ వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఆయన పని చేస్తున్నారు. గతంలో డీఎంఈగా ఆయన పని చేశారు.

13. సికింద్రాబాద్‌లో అక్రమాలపై ఉక్కుపాదం

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ అధికారులు, రక్షణ శాఖ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. బాంటియా గార్డెన్, బంగ్లా నెంబర్ 207లో అక్రమంగా కొనసాగుతున్న వ్యాపార సముదాయాన్ని హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చివేశారు. రక్షణ శాఖ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు లేదా వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

14. ఐబొమ్మ రవికి కస్టడీపై నేడు తీర్పు

పైరసీ కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ రవికి సంబంధించిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. రవి నుంచి కీలక సమాచారం సేకరించాల్సి ఉందని, 4 వేర్వేరు కేసుల్లో విచారణ జరపాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు.

15. మాదాపూర్‌లో మెడికల్ కోడింగ్‌లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం..

హైదరాబాద్ మాదాపూర్‌లో మెడికల్ కోడింగ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. నిరుద్యోగుల వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవహారం కలకలం సృష్టించింది. కొండాపూర్‌లో మైండ్‌స్పార్క్, మాదాపూర్‌లో ఫిడిక్షన్ అనే కంపెనీల ద్వారా మెంటర్ శ్రీకాంత్ జోషి ఒక్కొక్కరి వద్ద సుమారు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేశాడు. సుమారు 80 నుంచి 100 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని, శ్రీకాంత్ జోషి రాత్రికి రాత్రే పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు మాదాపూర్‌లోని క్యాపిటల్ పార్క్ వద్ద ఆందోళన చేశారు. శ్రీకాంత్ జోషితో పాటు దిలీప్ శివారెడ్డి కూడా కారణమంటూ బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

16. విమాన సర్వీసుల రద్దుతో అయ్యప్ప స్వాముల నిరసన

ఇండిగో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. సరైన సమాచారం అందించడం లేదని స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వాములకు తగిన ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు.

17. ఎన్నికల్లో ఫైట్ చేసి గెలవడం నా రక్తంలోనే ఉంది: దానం

ఎన్నికల్లో ఫైట్ చేయడం , గెలవడం తన రక్తంలోని ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనదైన శైలిలో స్పందించారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, CM రేవంత్ ఆదేశిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు దానం. తనకు ఎన్నికలు ఏమీ కొత్త కాదని, ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకే ఉందన్నారు నాగేందర్.

18. ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు.

ఆస్ట్రేలియా డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు చేయనుంది. దీనికి ముందుగానే మెటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్‌ ఖాతాలను బ్లాక్ చేయడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, ఇతర దేశాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని అక్కడి ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ సూచించింది. బ్లాక్ అవుతున్న ఖాతాల డేటాను ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా సంస్థలు పిల్లలకు సూచించాయి.

19. అర్ష్‌దీప్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన కోచ్..

అర్ష్‌దీప్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు కోచ్ జస్వంత్ రాయ్. వసీం అక్రమ్, జహీర్ ఖాన్ వీడియోలు చూస్తూ యార్కర్, రివర్స్ స్వింగ్‌ను అర్ష్‌దీప్ సింగ్ నేర్చుకున్నాడని అన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాపై వన్డేలలో అద్భుతంగా రాణించాడని, బుమ్రా లేకున్నా, భారీ స్కోర్ల మ్యాచ్‌లలోనూ పొదుపుగా బౌలింగ్ చేసి, పరిణతి సాధించాడని కోచ్ ప్రశంసించారు.

20. కన్నడ సూపర్ స్టార్‌కి ఘన స్వాగతం..

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. గుమ్మడి నరసయ్య మూవీ ప్రారంభోత్సవం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు దర్శకుడు పరమేశ్వర్ ఇవరాలే సహా పలువురు అభిమానులు స్వాగతం పలికారు. పాల్వంచ వెళ్లే ముందు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటానని శివరాజ్ కుమార్ తెలిపారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×