TTD : శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని టీటీడీ ఈవో ప్రకటించారు. 10,258.37 కిలోల బంగారం బ్యాంకుల్లో నిల్వ ఉందని తెలియజేసింది. గడిచిన మూడేళ్లలో స్వామివారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయి. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ. 15,938 కోట్లకి డిపాజిట్లు చేరుకున్నాయి. 2019 నాటికి 7,339.74 కేజీలు ఉండగా ప్రస్తుతం 10.258.37 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయని గణంకాలు బయటపెట్టారు.
టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతుందన్న ప్రచారం అవాస్తవమని ఈవో కొట్టి పారేశారు. స్వామివారి నగదు, బంగారం నిల్వలు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఎప్పుడూ పెట్టదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
శ్రీమంతుల నుంచి సామాన్యుడిదాకా ఆ కోనేటి రాయుడికి రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా… తమ స్థాయిని బట్టి నగదు, ఆభరణాలు సమర్పించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు, బంగారం, వెండి కానుకలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించేందుకు హుండీ ఏర్పాటు చేశారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్టు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.