మటన్ ఫ్రై పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఒకసారి రాయలసీమ ప్రాంతంలో చేసేలా మటన్ ఫ్రై రెసిపీని స్పైసీగా చేసి చూడండి. రుచి మాములుగా ఉండదు. ఈ మటన్ ఫ్రై ను అన్నంలో పొడిపొడిగా కలుపుకొని తిన్నా బాగుంటుంది. లేదా నేరుగా స్నాక్స్ లాగా తినేసినా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా బిర్యానీతో జతగా తింటే దాని రుచి మామూలుగా ఉండదు. రాయలసీమ స్టైల్లో మటన్ ఫ్రై చేయాలంటే లేత మాంసాన్ని తీసుకోవాలి. ఈ మటన్ ఫ్రై చేస్తే రెండు రోజులు దాకా తాజాగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మటన్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ – అరకిలో
పసుపు – అర స్పూను
నూనె – తగినంత
కారం – రెండు స్పూన్లు
ధనియాల పొడి – ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
గరం మసాలా – ఒక స్పూను
ఎండుమిర్చి – నాలుగు
పచ్చిమిర్చి – మూడు
రాయలసీమ మటన్ ఫ్రై రెసిపీ
1. మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి బాగా కలిపి ఆరు గంటల పాటు వదిలేయాలి.
4. తర్వాత కుక్కర్లో ఈ మటన్ ముక్కలను వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో కరివేపాకులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
7. అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి వేయించుకోవాలి.
8. ఇప్పుడు ఉడికిన మటన్ ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి.
9. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేదంటే రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
10. గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకొని నీరంతా ఇంకిపోయి డ్రై గా అయ్యే వరకు వేయించుకోవాలి.
11. దించేముందు కొత్తిమీరను చల్లుకోవాలి.
12. ఇది ముక్కలు పొడిపొడిగా అయ్యేవరకు వేయించుకోవాలి.
13. దీనికి కనీసం అరగంట సమయం పడుతుంది. కొత్తిమీరను చల్లకుంటే రుచికరమైన మటన్ ఫ్రై రెడీ అయినట్టే.
మటన్ వేపుడు రుచి అద్భుతంగా ఉంటుంది. కారం అధికంగా వేశాం కాబట్టి ఎర్రగా ముక్కలు వేగుతాయి. అలాగే స్పైసీగా ఉంటుంది. ఒక్కసారి మీరు దీన్ని తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటుంది.
మటన్ మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. అధికంగా తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకు పోయే అవకాశం ఉంటుంది. అదే మితంగా తింటే మాత్రం విటమిన్ బి1, విటమిన్ బి12, విటమిన్ ఈ, విటమిన్ కె, విటమిన్ బి3 వంటి పోషకాలు శరీరంలో చేరుతాయి. ముఖ్యంగా గర్భిణులు మటన్ తినడం ఎంతో అవసరం. దీనివల్ల గర్భస్థ శిశువులకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మటన్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.
ఇది ఎముకలకు, దంతాలకు కావాల్సిన పోషకాలను శరీరానికి అందిస్తుంది. అయితే రోజూ మటన్ తినడం అంత ఆరోగ్యకరం కాదు. వారంలో రెండు మూడు సార్లు మటన్ తినేందుకు ప్రయత్నించండి. అది కూడా ఒకసారి 100 గ్రాములకు మించి తినక పోవడమే మంచిది. మటన్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మితంగా తినడం అలవాటు చేసుకుంటే ఉత్తమం.