కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు నగరాలను బిక్షాటన రహిత సిటీలుగా మార్చేందుకు ‘స్మైల్’ (సపోర్టు ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్‌లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్) అనే పథకాన్ని తీసుకొచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ తో సహా 10 నగరాలను భిక్షాటన రహితంగా మార్చాలని భావిస్తున్నది. జనవరి 1 నుంచి ఈ పథకం ప్రారంభంకానుంది.
బిచ్చగాళ్లకు దానం చేసిన వారిపై కేసులు
ఇండోర్ జిల్లా యంత్రాంగం జనవరి 1 నుంచి నగరంలో బిచ్చగాళ్లకు దానం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ కాదని ఎవరైనా బిచ్చం వేస్తే పోలీసులు కేసులు పెడతారని హెచ్చరించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇండోర్ ను బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే బిక్షాటనపై అవగాహన కార్య్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. బిక్షాటన చేయడం మానుకోవాలని సూచించారు. బిక్షాటనపై నిషేధం విధిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ కాగా, జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పారు.
జనవరి 1 నుంచి ‘స్మైల్’ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్మైల్’ పైలెట్ ప్రాజెక్టు జనవరి 1 నుంచి మొదలుకానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, స్వచ్ఛంద సంస్థల సపోర్టుతో ఈ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందుగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నది. ఆ తర్వాత యాచకులను గుర్తించడంతో పాటు వారికి పునరావాసం కల్పించనున్నారు. ఆరోగ్యం సరిగా లేనివారికి వైద్య సాయం అందిస్తారు. ఆ తర్వాత వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి, చదువు నేర్పిస్తారు. చివరగా జీవనోపాధికి కావాల్సిన స్కిల్స్ ను పెంపొందిస్తారు.
Read Also: వందే భారత్ వేగానికి.. రైలు కింద నలిగిపోయిన విద్యార్థి, ఇలా కూడా జరుగుతుందా?
2011 లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 4.13 లక్షల బిచ్చగాళ్లు
బిక్షాటన అనేది మంచి పద్దతి కాదని, సమస్యలను ఎదుర్కొని దీటుగా నిలబడాలనే ఉద్దేశంతో ‘స్మైల్’ పథకాన్ని తీసుకొచ్చినట్లు అని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిరుపేద వ్యక్తులను వారి కాళ్ల మీద వారిని నిలబడేలా తయారు చేయడమే ఈ పథకం ఉద్దేశమని వివరించింది. బిక్షాటన అనేది అత్యంత దయనీయ పరిస్థితికి నిదర్శనం వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో యాచకులు సంఖ్య సుమారుగా 4.13 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. వీరిలో బాల బాలికలు, యువత పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బిక్షాటన రూపుమాపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగానే యాకులను గుర్తించి వారికి జీవనోపాధి కల్పించాలని భావిస్తోంది. అయితే, కొంత మంది బిక్షాటన పేరుతో ముఠాలను నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఇండోర్ కలెక్టర్ సింగ్. ఇకపై ఇండోర్ లో ఎక్కడా యాచకులు కనిపించరని తెలిపారు. ‘స్మైల్’ పథకాన్ని పకడ్బిందీగా అమలు చేస్తామని తెలిపారు.
Read Also: ఒక కప్పు టీ ధర రూ.లక్ష.. అంతా బంగారమే!