Hot water: చలికాలంతో పాటు మిగతా సీజన్లలోనూ చాలామంది వేడినీళ్లు తాగుతుంటారు. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతుంటారు. ఇది మన పొట్టను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇలా ఉదయం వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇది మన రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి తోడ్పడుతుందని, అందుకే తరచూ తాగమని సలహా ఇస్తుంటారు. అయితే, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవాళ్లు తరచూ వేడినీళ్లు తాగడం వల్ల.. ఆ సమస్యలు మరింత పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వాళ్లు వేడినీళ్లు తీసుకోకూడదు? ఎక్కువగా తాగితే ఏమౌతుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణం కంటే తక్కువ రక్తపోటు ఉన్నట్లయితే.. ప్రతిరోజూ ఉదయం వేడినీళ్లు తాగడం వల్ల మరింత బలహీన పడవచ్చు. కొన్నిసార్లు తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. వేడినీళ్లు రక్త నాళాలను విస్తరిస్తుంది కాబట్టి.. ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు చాలావేడిగా కాకుండా గోరువెచ్చని నీరు మాత్రమే తీసుకోవాలి.
గుండె సంబంధిత సమస్యులు ఉన్నవాళ్లు.. చాలా వేడిగా నీటిని తీసుకోకూడదు. వేడి ఎక్కువగా ఉండటం వల్ల శరీర సిరలు, ధమనులపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది అసాధారణ హృదయ స్పందనలకు దారితీయొచ్చు. కాబట్టి.. ఉదయం పూట వేడిగా కాకుండా మీ గది ఉష్ణోగ్రతకు సరిపోయేలా నీరు తాగడం ఉత్తమం.
అసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నవాళ్లు.. వేడినీళ్లు తీసుకుంటే.. ఆమ్లత యొక్క పరిస్థితి తీవ్రతరం అవుతుంది. అధిక వేడినీరు కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. శ్లేష్మ పొరను బలహీనపరుస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వేడివేడిగా నీళ్లు తాగడం వల్ల కొంతమందిలో మైగ్రేన్ తీవ్రత పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల రక్త నాళాలను విస్తరిస్తుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి లేదా వణుకు వస్తుంది. కాబట్టి.. మైగ్రేన్ సమస్యలు ఉంటే.. ఉదయం చల్లటి లేదా సాధారణ నీటిని తాగాలి. అలాగే దంతాలు, చిగుళ్ల సమస్యలున్నవాళ్లు కూడా వేడినీటిని తీసుకోవడం హానికరం. ఇది ఎనామిల్‌ను దెబ్బతీసి, చిగుళ్ల వాపును పెంచుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ గది ఉష్ణోగ్రతను బట్టి చల్లని లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవడం ఉత్తమం.