Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ అనేది మన ఇళ్లలో తరచుగా వండుకునే.. చాలా రుచికరమైన, తక్కువ సమయంలో తయారు చేయగలిగే వంటకం. గుడ్లలోని పోషకాలు, టమాటోల పులుపు, మసాలాల ఘాటు కలగలిసి ఈ కూరను అన్నం, రోటీ లేదా చపాతీలోకి అద్భుతమైన కాంబినేషన్‌గా మారుస్తాయి. ఈ రుచికరమైన టమాటో ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
గుడ్లు– 6(ఉడకబెట్టినవి)
టమాటోలు- 3-4
ఉల్లిపాయలు – 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ –1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి- 2-3
నూనె-3-4
కారం – 1.5 టీ స్పూన్లు
పసుపు –1/2 టీ స్పూన్లు
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2 టీ స్పూన్
గరం మసాలా – 1/2 టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
తాళింపు కోసం: 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర
కరివేపాకు, కొత్తిమీర – సరిపడా
Also Read: సింపుల్‌గా ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్
తయారీ విధానం:
ముందుగా.. గుడ్లను ఉడకబెట్టి పై పెంకు తీసి.. చాక్‌తో వాటిపై ఒకటి లేదా రెండు గాట్లు పెట్టండి. తర్వాత ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. అందులో గాట్లు పెట్టిన గుడ్లు అన్ని వైపులా లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించి, పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటమనే వరకు వేయించండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేసి, ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించండి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు (సుమారు 1 నిమిషం) వేయించండి. పసుపు, కారం, ధనియాల పొడి , జీలకర్ర పొడి వేసి, నూనెలో సుమారు 30 సెకన్లు మసాలాలను వేయించండి.
మసాలాలు మాడిపోకుండా జాగ్రత్తపడండి. తరువాత..టమాటో ప్యూరీని (లేదా మెత్తగా చేసిన టమాటో ముద్దను) వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, టమాటోల నుంచి నూనె పైకి తేలే వరకు (సుమారు 5-7 నిమిషాలు) మీడియం మంటపై ఉడికించండి. గ్రేవీ కావలసిన చిక్కదనాన్ని బట్టి ఒక కప్పు నీటిని కలపండి. ఉప్పు సరి చూసుకుని.. గ్రేవీని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించండి. గ్రేవీ ఉడుకుతున్నప్పుడు.. వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను మెల్లగా అందులో వేయండి.
చివరగా.. గరం మసాలా వేసి, సుమారు 5 నిమిషాలు చిన్న మంటపై మూత పెట్టి ఉడికించండి. తద్వారా గుడ్లు గ్రేవీ రుచిని పీల్చుకుంటాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. పై నుంచి తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయండి.వేడి వేడిగా అన్నం, పుల్కా, రోటీ లేదా పరాటాతో టమాటో ఎగ్ కర్రీని వడ్డించండి. సింపుల్ గా రుచికరమైన టమాటో ఎగ్ కర్రీని ఇలా తయారు చేసి, ఫ్యామిలీతో పాటు కలిసి తిని ఎంజాయ్ చేయండి.