Bedroom Safety Tips: మనం రోజంతా ఎంత కష్టపడి పనిచేసినా.. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతేనే మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటాం. మంచి నిద్ర పట్టాలంటే కేవలం మెత్తటి పరుపు, దిండు ఉంటే సరిపోదు. మనం పడుకునే బెడ్ రూమ్ కూడా శుభ్రంగా, ప్రశాంతంగా ఉండాలి. కానీ మనలో చాలామంది తెలియకుండానే కొన్ని వస్తువులను మంచం పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. దీనివల్ల నిద్ర చెడిపోవటమే కాకుండా ఆరోగ్యానికి, ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంతకీ రాత్రిపూట బెడ్ దగ్గర ఉంచకూడని ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దిండు పక్కనే పెట్టుకుంటారు. ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, కాల్స్, స్క్రీన్ వెలుతురు వల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాకుండా.. బెడ్ మీద లేదా దిండు కింద ఫోన్ పెట్టి ఛార్జింగ్ చేయడం చాలా ప్రమాదం. దీనివల్ల వేడి బయటకు పోక ఫోన్ పేలిపోయే లేదా మంటలు అంటుకునే అవకాశం ఉంది. అందుకే ఎలక్ట్రానిక్ వస్తువులను మంచానికి దూరంగా ఒక టేబుల్ మీద పెట్టి ఛార్జ్ చేసుకోవాలి.
రాత్రిపూట ఆకలి వేసినప్పుడు బెడ్ మీద కూర్చుని స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది. తిన్న తర్వాత ప్లేట్లు, మిగిలిపోయిన ఆహారాన్ని అక్కడే వదిలేయడం వల్ల చీమలు, బొద్దింకలు, ఇతర పురుగులు చేరుతాయి. ఇది బెడ్ రూమ్ వాతావరణాన్ని పాడుచేయడమే కాకుండా అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి.. పడుకునే ముందే ఆహార పదార్థాలను, కవర్లను బయట పడేసి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే గోల్డెన్ మిల్క్.. ఎప్పుడు తాగాలి? ఎలా చేసుకోవాలి?
రోజంతా వేసుకున్న బట్టలను విప్పి మంచం పక్కనే ఉన్న కుర్చీలో పడేయడం చాలామందికి అలవాటు. చెమటతో తడిసిన బట్టలను అలా వదిలేస్తే వాటి నుంచి దుర్వాసన రావడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల గదిలో గాలి కలుషితమై అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. ఉతకాల్సిన బట్టలను ఎప్పుడూ బెడ్ రూమ్‌కు దూరంగా ఉండే లాండ్రీ బాస్కెట్‌లోనే వేయాలి.
గదిలో మంచి సువాసన కోసం కొందరు అగరబత్తులు లేదా సువాసన వెదజల్లే కొవ్వొత్తులు వెలిగిస్తారు. కానీ వాటిని ఆర్పకుండా నిద్రపోవడం చాలా ప్రమాదకరం. గాలికి నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న కర్టెన్లు లేదా దుప్పట్లకు అంటుకునే అవకాశం ఉంది. అలాగే ఆ పొగ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి నిద్రపోయే ముందే వీటిని కచ్చితంగా ఆర్పేయాలి.
మంచం పక్కన ఉండే టేబుల్ మీద గ్లాసులు, కత్తెరలు, కత్తులు లాంటి పదునైన వస్తువులు అస్సలు ఉంచకూడదు. రాత్రిపూట చీకట్లో నిద్రమత్తులో చేయి తగిలితే అవి కింద పడి గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే టిక్ టిక్ మంటూ శబ్దం చేసే గడియారాలను కూడా బెడ్ దగ్గర కాకుండా కాస్త దూరంగా పెట్టుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
Also Read: అల్లం ఎండిపోకుండా నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!