Travel Skincare Tips| ఎక్కడైనా ప్రయాణానికి వెళ్లాలని ప్లాన్ చేసినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది కొత్త బట్టలు, అందమైన షూస్, మేకప్ వస్తువులే. అయితే ప్రయాణంలో చర్మ సంరక్షణ గురించి కూడా అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఎండ, దుమ్ము, కాలుష్యం, చెమట, వాతావరణ మార్పులు చర్మంపై ప్రభావం చూపిస్తాయి. ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది. అందుకే ప్రయాణానికి సిద్ధమయ్యే ముందే కొన్ని ముఖ్యమైన స్కిన్ కేర్ వస్తువులను బ్యాగులో పెట్టుకోవాలి.
ప్రయాణంలో ఎక్కువసేపు బయట తిరగాల్సి రావచ్చు. అలాంటప్పుడు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ ఉపయోగపడుతుంది. కనీసం SPF 30 ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఎంచుకోండి. బయటకు వెళ్లడానికి 15 నిమిషాల ముందే రాయండి. ప్రతి రెండు గంటలకు మళ్లీ అప్లై చేయండి. ఈత కొట్టిన తర్వాత లేదా ఎక్కువగా చెమట పట్టినప్పుడు కూడా తిరిగి రాయాలి.
ప్రయాణంలో ముఖంపై దుమ్ము, చెమట, కాలుష్యం పేరుకుపోతాయి. వీటిని తొలగించడానికి మీ చర్మానికి సరిపోయే మైల్డ్ ఫేస్ వాష్ తీసుకెళ్లండి. ఎక్కువసార్లు ముఖం కడగడం, గట్టిగా స్క్రబ్ చేయడం మానుకోండి. ఇవి చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తాయి.
ఎక్కువసేపు ప్రయాణించడం, చల్లని గాలి, ఏసీ వల్ల చర్మం పొడిబారుతుంది. అందుకే చిన్న మాయిశ్చరైజర్ ప్యాక్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు తేలికపాటి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. డ్రై స్కిన్ ఉన్నవారు కాస్త చిక్కటి క్రీమ్ ఉపయోగిస్తే మంచింది.
వాతావరణ మార్పులు, డీహైడ్రేషన్ వల్ల పెదవులు పొడిబారి పగిలిపోవచ్చు. అందుకే చిన్న లిప్ బామ్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోండి. ఎక్కువసేపు ఎండలో తిరిగేవారు SPF ఉన్న లిప్ బామ్ ఎంచుకోవడం మంచిది.
ప్రయాణంలో తరచుగా చేతులు కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారవచ్చు. చిన్న హ్యాండ్ క్రీమ్ తీసుకెళ్లి, చేతులు కడిగిన తర్వాత రాసుకోండి.
ట్రిప్‌లో మేకప్ వేసుకునేవారు మైల్డ్ మేకప్ రిమూవర్ లేదా క్లెన్సర్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్‌తోనే నిద్రపోవడం మానుకోండి.
Also Read: ట్రావెల్ ట్రిప్ ప్లానింగ్ కోసం AI ఉపయోగిస్తున్నారా? ఈ సమస్యలు రావచ్చు జాగ్రత్త
ముఖం తుడుచుకోవడానికి శుభ్రమైన చిన్న టవల్ తీసుకెళ్లండి. మేకప్ తొలగించడానికి కాటన్ ప్యాడ్స్ ఉపయోగపడతాయి. మాయిశ్చరైజర్, లిప్ బామ్ చిన్న ప్యాక్స్ తీసుకుంటే బ్యాగులో ఎక్కువ స్థలం అవసరం ఉండదు.
Also Read: హాస్టల్ లేదా పీజీలో చేరాలనుకుంటున్నారా? పొరపాటున ఈ తప్పులు చేయకండి
ట్రిప్ సమయంలో మొదటిసారిగా కొత్త ఉత్పత్తులు ఉపయోగించకండి. వాటివల్ల అలర్జీ, మంట లేదా దురద వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పటికే సరిపడే ఉత్పత్తులనే తీసుకెళ్లండి. ఇలా ముందుగానే సిద్ధమైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తూనే చర్మ సంరక్షణను కూడా సులభంగా కొనసాగించవచ్చు.