Why Hanuman Didnt Stop Vaali| ఒక్క గర్జనతోనే శత్రువులను వణికించగల హనుమంతుడు.. సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్న మహావీరుడు. అలాంటి ఆంజనేయుడు తన స్నేహితుడైన సుగ్రీవుడిని వాలి వేధిస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయాడు? వాలిని ఓడించే శక్తి ఉన్నా ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? ఈ సందేహమే రామాయణంలో శ్రీ రాముడికి వచ్చింది. దీని వెనుక హనుమంతుడికి లభించిన శాపమే కారణం.
రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యపాలన చేపట్టాడు. ఆ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరాముడిని కలిసేందుకు వచ్చారు. అప్పుడు వారి మధ్య సంభాషణలో రాముడు.. హనుమంతుడి గురించి ఓ ప్రశ్న అడిగాడు. అపారమైన బలం ఉన్న హనుమంతుడు సుగ్రీవుడిని వాలి నుంచి ఎందుకు రక్షించలేకపోయాడని ప్రశ్నించాడు.
దీనికి అగస్త్య మహర్షి ఆసక్తికరమైన కారణాన్ని వివరించాడు. హనుమంతుడి చిన్నతనంలో జరిగిన సంఘటనే దీనికి కారణమని చెప్పాడు.
బాల్యంలోనే హనుమంతుడు అనేకమంది దేవతల నుంచి దివ్యమైన వరాలు పొందాడు. బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, యముడు, కుబేరుడు, శివుడు ఆయనకు ప్రత్యేక శక్తులను ప్రసాదించారు. ఈ వరాల వల్ల హనుమంతుడు అసాధారణమైన బలాన్ని పొందాడు. అయితే చిన్నతనంలో తన శక్తుల గొప్పతనం ఆయనకు తెలియదు. అందుకే తన అల్లరితో ఆశ్రమాల్లోని రుషులను ఇబ్బంది పెట్టేవాడు.
హనుమంతుడు తన అపారమైన బలంతో రుషుల ఆశ్రమాల్లో అల్లరి చేసేవాడు. వారి పూజా కార్యక్రమాలకు ఆటంకం కలిగించేవాడు. పవిత్రమైన వస్తువులను చెల్లాచెదురు చేసేవాడు. నీటి కుండలను పగలగొట్టి ధ్యానానికి అంతరాయం కలిగించేవాడు. చివరకు ఆయన అల్లరితో విసిగిపోయిన రుషులు శాపం ఇచ్చారు. తనకున్న అపారమైన శక్తులను హనుమంతుడు మర్చిపోతాడని చెప్పారు. ఎవరైనా ఆయన శక్తి గురించి గుర్తుచేసినప్పుడు మాత్రమే వాటిని తిరిగి గుర్తిస్తాడని శపించారు. అయితే ఈ శాపం వల్ల ఆయన శక్తులు నశించలేదు. కేవలం ఆయనక గుర్తుకు లేవు.
వాలి సుగ్రీవుడిని రాజ్యం నుంచి తరిమేసిన సమయంలో హనుమంతుడికి తన పూర్తి శక్తుల గురించి అవగాహన లేదు. చిన్నతనంలో రుషులు ఇచ్చిన శాపం దీనికి కారణమని ఈ పురాణ కథనం వివరిస్తుంది. అందుకే వాలిని ఎదుర్కొనేందుకు తనకు సామర్థ్యం ఉందని ఆయన గుర్తించలేకపోయాడు. ఇది భయం వల్ల జరిగింది కాదని కథ చెబుతోంది. వాలి, హనుమాన్‌ల మధ్య పోరాటం జరిగినప్పుడు కూడా బ్రహ్మ దేవుడు ఆయనను వాలిపై పూర్తి శక్తితో దాడి చేయకూడదని కోరారు. ఈ కారణంగా హనుమాన్ దాడి చేయకపోయినా.. వాలికి తనకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరాన్ని (ఎదుటివారి శక్తిలో సగం హరించే శక్తి) ప్రయోగించాడు. అలా చేయగా.. హనుమంతుడి అపారశక్తి గ్రహించడానికి వాలి శరీరం సహకరించలేదు. దీంతో ఆ పోరాటాన్ని వాలి విరమించి వెళ్లిపోయాడు.
సీతమ్మ జాడ కోసం వెతుకుతున్న వానర సేన సముద్ర తీరానికి చేరుకుంది. లంకకు వెళ్లడానికి సముద్రాన్ని దాటగల వీరుడు అవసరమయ్యాడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి ఆయనలోని అపారమైన శక్తులను గుర్తుచేశాడు. దీంతో హనుమంతుడికి తన సామర్థ్యంపై నమ్మకం తిరిగి వచ్చింది. వెంటనే సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు.
Also Read: భారతదేశంలో మొట్టమొదటి రామాయణం సినిమా.. రాముడు, సీత పాత్రలు పోషించిన ఒకే నటుడు
హనుమాన్ చాలీసాలోని ‘ఆపన్ తేజ్ సమ్హారో ఆపై, తీన్ లోక్ హాంక తే కాంపై’ అనే పంక్తి ఆయన అపారమైన శక్తిని వివరిస్తుంది. ఈ కథ మనలో ఉన్న సామర్థ్యాన్ని మనమే గుర్తించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. సరైన ప్రోత్సాహం, ఆత్మవిశ్వాసం ఉంటే మనలోని శక్తిని బయటకు తీసుకురావచ్చు. బలం మాత్రమే కాదు, వినయం, భక్తి, వివేకం కూడా ముఖ్యమని హనుమంతుడి జీవిన విధానం తెలియజేస్తుంది.