Bathroom Tiles Selection| బాత్రూమ్ అందంగా కనిపించాలంటే ఖరీదైన టైల్స్ వేయించాల్సిన అవసరం లేదు. సరైన టైల్స్ ఎంచుకుంటే చిన్న బాత్రూమ్ కూడా విశాలంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే బాత్రూమ్‌లో ఎప్పుడూ తేమ, నీళ్లు ఉండటంతో టైల్స్ ఎంపికలో జాగ్రత్త అవసరం. అందమైన డిజైన్‌తో పాటు మన్నిక, నీటిని తట్టుకునే గుణం, జారిపోకుండా ఉండే లక్షణాలు కూడా పరిశీలించాలి. మార్కెట్‌లో అనేక రకాల టైల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బాత్రూమ్‌కు ఏవి సరిపోతాయో తెలుసుకుందాం.
బాత్రూమ్‌కు టైల్స్ ఎంచుకునేటప్పుడు వాటి మెటీరియల్, పరిమాణం, నాణ్యత పరిశీలించాలి. ముఖ్యంగా నీటిని ఎంతవరకు పీల్చుకుంటాయో తెలుసుకోవాలి. తక్కువ నీటిని పీల్చుకునే టైల్స్ ఎక్కువకాలం మన్నుతాయి.
చిన్న బాత్రూమ్‌లకు పెద్ద సైజు టైల్స్ ఉపయోగిస్తే విశాలంగా కనిపిస్తాయి. చిన్న టైల్స్‌తో అందమైన డిజైన్లు రూపొందించవచ్చు. అయితే వాటి మధ్య ఎక్కువగా గ్రౌట్ లైన్లు ఉంటాయి. వాటిలో దుమ్ము, సబ్బు మరకలు పేరుకుపోవచ్చు. కాబట్టి శుభ్రం చేయడానికి సులభమైన టైల్స్ ఎంచుకోవడం మంచిది.
సిరామిక్ టైల్స్ తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి. వీటిని కట్ చేయడం, అమర్చడం కూడా సులభం. అయితే వీటి క్వాలిటీని బట్టి నీటిని పీల్చుకునే సామర్థ్యం మారుతుంది. అందువల్ల బాత్రూమ్ వినియోగానికి అనుకూలమైన టైల్స్ ఎంచుకోవాలి.
పోర్సిలిన్ టైల్స్ దృఢంగా ఉంటాయి. ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి. అందువల్ల బాత్రూమ్ ఫ్లోరింగ్, గోడలకు మంచి ఎంపికగా నిలుస్తాయి. అయితే ఇవి బరువుగా ఉండటంతో నిపుణులతో వీటిని సెట్ చేస్తే మంచిది.
మార్బుల్, ఇతర సహజ రాళ్లతో తయారయ్యే టైల్స్ బాత్రూమ్‌కు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. వీటిలో సహజమైన రంగులు, ఆకర్షణీయమైన డిజైన్లు ఉంటాయి. అయితే కొన్ని రకాల రాళ్లకు తేమ, మరకల నుంచి రక్షణ కోసం ప్రత్యేక సీలింగ్ అవసరం. వీటి నిర్వహణ ఖర్చు కూడా పరిగణించాలి.
గ్లాస్ టైల్స్ వివిధ రంగులు, ఆకర్షణీయమైన ఫినిషింగ్‌లలో లభిస్తాయి. వీటిని గోడలపై, డెకరేటివ్ భాగాల్లో ఉపయోగించవచ్చు. అయితే తడిగా ఉన్నప్పుడు కొన్ని గ్లాస్ టైల్స్ జారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫ్లోరింగ్ కంటే గోడలకు ఉపయోగించడం మంచిది.
చిన్న చిన్న ముక్కలతో తయారయ్యే మొజాయిక్ టైల్స్ బాత్రూమ్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి. వీటితో బోర్డర్లు, అందమైన నమూనాలు రూపొందించవచ్చు. సరైన టెక్స్చర్ ఉన్న టైల్స్ మంచి పట్టును కూడా అందిస్తాయి. అయితే ఎక్కువ గ్రౌట్ లైన్లు ఉండటంతో తరచూ శుభ్రం చేయాలి.
Also Read: పని చేస్తున్నా గుర్తింపు రావడం లేదా? ఆఫీస్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటూ ఇలా విజయం సాధించండి
లేత గోధుమ, క్రీమ్, లేత బూడిద రంగులు బాత్రూమ్ విశాలంగా చూపిస్తాయి. బ్లూ, గ్రీన్, నలుపు – తెలుపు మిక్స్ ఆధునిక రూపాన్ని ఇస్తాయి. మ్యాట్ ఫినిషింగ్ టైల్స్ సాధారణంగా మంచి పట్టును అందిస్తాయి. కొనుగోలు సమయంలో అవసరమైన పరిమాణం కంటే 10 నుంచి 15 శాతం అదనంగా తీసుకోవాలి. కటింగ్, పగుళ్ల వల్ల వృథా అయ్యే టైల్స్‌కు ఇది ఉపయోగపడుతుంది.
Also Read: 9 నెలల్లో రూ.56 లక్షలు ఆదాయం.. ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న దంపతులు.. ఐడియా సూపర్ హిట్
టైల్స్‌పై మరకలు, సబ్బు అవశేషాలు పేరుకుపోకుండా తరచూ శుభ్రం చేయాలి. తేలికపాటి క్లీనర్లు, మృదువైన బ్రష్ ఉపయోగించాలి. సరైన టైల్స్ ఎంపికతో పాటు సరిగ్గా మెయిన్‌టెనెన్స్ ఉంటే బాత్రూమ్ ఎక్కువకాలం అందంగా, పరిశుభ్రంగా ఉంటుంది.