Ginger Storage Tips: మన వంటింట్లో రోజూ తాగే టీ నుండి వండే కూరల వరకు అల్లం లేనిదే మంచి రుచి రాదు. అందుకే మనలో చాలామంది మార్కెట్‌కు వెళ్లినప్పుడే ఒకేసారి కాస్త ఎక్కువగా అల్లం కొని తెచ్చుకుంటారు. కానీ దాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే కొద్ది రోజులకే ఎండిపోయి గట్టిపడటం లేదా బూజు పట్టడం జరుగుతుంది. అప్పుడు డబ్బులు పెట్టి కొన్న అల్లం కాస్తా వృథా అవుతుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అల్లాన్ని ఏకంగా నెల రోజుల పాటు అప్పుడే తెచ్చినంత తాజాగా ఉంచుకోవచ్చు. మరి అల్లాన్ని ఫ్రిజ్‌లో ఎలా దాచాలి, తరిగిన అల్లాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అల్లాన్ని బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే కేవలం రెండు నుండి ఐదు రోజుల్లోపు వాడేయడం మంచిది. ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే మాత్రం ఫ్రిజ్‌లో పెట్టడమే సరైన మార్గం. బయట నుండి తెచ్చిన అల్లాన్ని శుభ్రంగా కడిగి, తడి ఏమాత్రం లేకుండా పొడిబట్టతో తుడవాలి. ఆ తర్వాత పొట్టు తీయకుండానే గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లోని కూరగాయల అరలో (క్రిస్పర్ డ్రాయర్) పెట్టండి. ఇలా ఉంచితే సుమారు రెండు నుండి మూడు వారాలు, ఇంకా సరిగ్గా నిల్వ చేస్తే నెల రోజుల వరకు కూడా అల్లం ఏమీ కాదు. అయితే మధ్యలో అవసరమైనప్పుడు ముక్కలు తీసుకుని, మిగతా అల్లాన్ని వెంటనే తిరిగి డబ్బాలో పెట్టి మూత బిగించాలి. డబ్బాలో నీటి చుక్కలు చేరితే అల్లం త్వరగా పాడవుతుంది కాబట్టి.. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి.
వంట చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందని చాలామంది అల్లాన్ని ముందుగానే చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటారు. కానీ ముక్కలు చేసిన తర్వాత దానికి గాలి, తేమ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. తరిగిన అల్లాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. శుభ్రంగా, పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే కొన్ని వారాల పాటు తాజాగా ఉంటుంది. అయితే వాడే ముందు దాని రంగు, వాసన మారాయేమో గమనించాలి. ఒకవేళ ఎక్కడైనా బూజు కనిపిస్తే మాత్రం ఆ ముక్కలన్నింటినీ పారేయడమే మంచిది.
Also Read: క్లాస్ టాపర్ పక్కన కూర్చుంటే మీ పిల్లలు కూడా బాగా చదువుతారా? సైకాలజీ ఏం చెబుతోందంటే!
పొట్టు తీసిన అల్లం గాలి తగిలితే చాలా త్వరగా పాడైపోతుంది. అందుకే దాన్ని ప్లాస్టిక్ ర్యాప్‌తో (కవర్‌తో) గాలి చొరబడకుండా గట్టిగా చుట్టి ఫ్రిజ్‌లోని కూరగాయల అరలో పెట్టాలి. ఇలా చేస్తే రెండు నుండి మూడు వారాల పాటు నిల్వ ఉంటుంది. ఇక తురిమిన అల్లం విషయానికొస్తే.. దీన్ని ఎక్కువ రోజులు దాచలేం. గాలి చొరబడని డబ్బాలో ఫ్రిజ్‌లో పెట్టినా వారం రోజుల్లోపు వాడేయాలి. కాబట్టి.. అవసరానికి మించి ముందుగానే అల్లాన్ని తురిమి పెట్టుకోకపోవడం ఉత్తమం.
అల్లం ఇంకా ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలంటే డీప్ ఫ్రీజర్‌ను వాడుకోవచ్చు. పొట్టు తీయని అల్లం ముక్కలను గానీ, తురిమిన అల్లాన్ని గానీ గాలి చొరబడని డబ్బాలో లేదా ఫ్రీజర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఇలా గడ్డకట్టించి ఉంచిన అల్లాన్ని ఆరు నెలల వరకు వాడుకోవచ్చు. ఆరు నెలలు దాటితే మాత్రం దాని సహజమైన రుచి, వాసన తగ్గిపోయే అవకాశం ఉంది.
ఏ పద్ధతిలో నిల్వ చేసినా అల్లం గోధుమ రంగులోకి మారినా, మెత్తగా లేదా జిగురుగా అనిపించినా, బూజు కనిపించినా అస్సలు వాడకూడదు. అలాగే నిల్వ చేసే ముందు అల్లం పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకుంటే, మీకు అవసరమైన ప్రతిసారీ తాజా అల్లం చేతిలో సిద్ధంగా ఉంటుంది.
Also Read: ఉదయం టిఫిన్‌కు రవ్వ ఉప్మా మంచిదా, ఓట్స్ తింటే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!