Sore Throat: కాలుష్యం కారణంగా ఉదయాన్నే గొంతు నొప్పి లేదా గొంతులో గరగర రావడం అనేది ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. గాలిలో ఉండే ధూళి కణాలు, పొగ, రసాయనాల వల్ల గొంతులోని సున్నితమైన కణజాలం వాపుకు గురవుతుంది. ఈ సమస్యను హోం రెమెడీస్ వాడి తగ్గించుకోవచ్చు. మందులు వాడకుండా ఎలాంటి హోం రెమెడీస్ గొంతు నొప్పిని తగ్గిస్తాయో ఇప్పుు తెలుసుకుందాం.
గొంతు నొప్పికి హోం రెమెడీస్:
1. గోరువెచ్చని ఉప్పు నీరు :
కాలుష్యం వల్ల గొంతులో చేరిన విషపూరిత కణాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం గోరువెచ్చని ఉప్పు నీటితో పుకిలించడం. ఇందుకోసం గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా ఉప్పు కలిపి, రోజులో 3-4 సార్లు గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇది గొంతు వాపును తగ్గించి, ఉపశమనాన్ని ఇస్తుంది.
2. తేనె, అల్లం రసం :
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండగా.. అల్లం యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఒక చెంచా అల్లం రసంలో కొంచెం తేనె కలిపి తీసుకోవాలి. ఇది గొంతులో రక్షణ పొరలా ఏర్పడి, కాలుష్యం వల్ల కలిగే దురదను తగ్గిస్తుంది. అంతే కాకుండా తక్కువ సమయంలో గొంతు నొప్పిని మాయం చేస్తుంది.
3. పసుపు పాలు:
పసుపులో ఉండే ‘కర్కుమిన్’ సహజమైన యాంటీ బయోటిక్‌లా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి తాగాలి. ఇది గొంతు ఇన్ఫెక్షన్‌ను వేగంగా తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది.
4. ఆవిరి పట్టడం:
కాలుష్యం వల్ల నాసికా రంధ్రాలు, గొంతు ఎండిపోయి నొప్పి పుడుతుంది. ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళాలు తేమగా మారుతాయి. ఇందుకోసం ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని, తలపై టవల్ కప్పుకుని 5-10 నిమిషాల పాటు ఆవిరి పీల్చాలి. ఇందులో కొంచెం నీలగిరి నూనె వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
5. తులసి, పుదీనా టీ:
తులసి ఆకులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా గొంతుకు చల్లదనాన్ని ఇస్తుంది. కొన్ని తులసి ఆకులు, పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ఇది శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా నొప్పిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.
6. ఎండు ఖర్జూర:
ఆయుర్వేదం ప్రకారం.. ఎండు ఖర్జూర గొంతు సమస్యలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎండు ఖర్జూర లోపల గింజ తీసేసి, అందులో ఒక మిరియపు గింజను ఉంచి నమిలి తినాలి. ఇది గొంతు నొప్పిని వెంటనే తగ్గిస్తుంది.
7. ద్రవ పదార్థాలు :
గొంతు ఎండిపోవడం వల్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి రోజు గోరు వెచ్చని నీరు, కొబ్బరి నీళ్లు లేదా సూప్‌లు తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
Also Read: హార్ట్ ఎటాక్ దరిచేరకూడదా? అయితే రోజుకు 30 నిమిషాల నడక మస్ట్!
8. యాపిల్ సైడర్ వెనిగర్:
ఇందులోని అసిడిక్ గుణాలు గొంతులోని హానికర బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఒక కప్పు వెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముందు జాగ్రత్తలు:
బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్క్ ధరించండి.
ఇంట్లో గాలి శుభ్రంగా ఉండటానికి ఎయిర్ ప్యూరిఫైయర్ వాడటం లేదా ఇండోర్ ప్లాంట్స్ పెంచడం మంచిది.
రాత్రిపూట గొంతు ఎండిపోకుండా ఉండటానికి పక్కనే నీటిని ఉంచుకోండి.