80s Maggi Memories: 80ల నాటి సాయంత్రాలు ఇప్పటిలా కేవలం సమయం మాత్రమే కాదు. అదొక అమూల్యమైన జ్ఞాపకం. బడి వదిలాక ఆకలితో ఇంట్లోకి అడుగుపెట్టగిన చిన్నారులకు అమ్మ చేతి వంటకాల సువాసనలు ఇప్పటికీ చాలామంది మనస్సుల్లో తాజాగానే ఉన్నాయి. అమ్మల సాంప్రదాయ వంటకాల నడుమ 2 నిమిషాల్లో తయారయ్యే ఆ పసుపు రంగు మ్యాగీ ప్యాకెట్ అప్పట్లో పిల్లల ప్రపంచంలోకి ఓ అద్భుతమైన మ్యాజిక్‌లా ప్రవేశించింది. ఆ పొగలు కక్కే నూడుల్స్, ఆ మసాలా రుచి కేవలం ఒక కొత్త తిండి మాత్రమే కాదు. ఒక తరం చిన్ననాటి అల్లరిని, పంచుకున్న ఆనందాలను తనలో దాచుకున్న తీపి జ్ఞాపకాల పెట్టె. ఆనాటి మొదటి మ్యాగీ ముద్ద ఇచ్చిన అనుభూతి గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
అది 1980ల కాలం. ఇంట్లో పిల్లలకు ఆకలి వేస్తే అమ్మ చేతి వంట సిద్ధంగా ఉండేది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం… సాయంత్రం ఇంట్లో చేసిన చిరుతిళ్లు… అదే సాధారణ జీవితం. అలాంటి సమయంలో… 1983లో నెస్లే సంస్థ మ్యాగీ నూడుల్స్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కొత్తగా కనిపించిన ఆ ప్యాకెట్.. పిల్లలకు ఓ ఆసక్తి.. ‘ఇది ఎలా ఉంటుంది..?’ అనే ఓ కుతూహలం. అప్పట్లో నూడుల్స్ అనేది చాలామందికి కొత్త అనుభవం. ప్యాకెట్ తెరవడం.. మసాలా వేయడం.. కొద్ది నిమిషాల్లో తయారయ్యే ఆ వంటకం చూడటం. పిల్లలకు ఓ చిన్న మ్యాజిక్‌లా అనిపించేది.
మార్కెట్లో విడుదలైన కొద్ది రోజులకే మ్యాగీకి విశేష ఆధరణ లభించింది. దీంతో అది నెమ్మదిగా ఇళ్లలోకి చేరడం ప్రారంభించింది. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు.. తక్షణమే అందించే స్నాక్ గా అది మారిపోయింది. అంతేకుండా సెలవు రోజుల్లో వంటగదిలోని అమ్మ చుట్టూ తిరుగుతూ మ్యాగీ కావాలని, ప్లేటులో తనకు ముందే పెట్టాలని, కాస్త ఎక్కువ వడ్డించాలని అప్పట్లో పిల్లలు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో మ్యాగీతో పాటు టీవీ ప్రకటనలు కూడా పిల్లల మనసుల్లో గుర్తుండిపోయాయి. ఓ కొత్త తరం.. కొత్త రుచులను పరిచయం చేసుకున్న సమయం అది.
Also Read: ఇప్పటి ఆర్భాటాలు లేవు కానీ.. 80ల్లో వినాయకచవితి మజానే వేరు.. ఆ రోజులు మళ్లీ రావు!
అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫాస్ట్ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఇలా అన్నీ జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు మ్యాగీలోనూ ఎన్నో రకాల ఫ్లేవర్లు వచ్చాయి. అలాగే మనుషులు సైతం కొత్త కొత్త ఆహారాలు, రుచులకు అలవాటు పడ్డారు. కానీ 80’sలో మొదటిసారి మ్యాగీ ప్యాకెట్ చేతిలో పట్టుకున్న ఆనందం.. అమ్మ దానిని వండుతున్నప్పుటు వచ్చిన ఘుమఘుమఘుమలు.. స్నేహితులతో కలిసి తిన్న ఆ చిన్న చిన్న ఆనందాలు మాత్రం ఓ తరానికి ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మారిపోయాయి. అందుకే 80’s ట్రెండ్ అంటే.. పాత వస్తువులను మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు.. మన చిన్ననాటి చిన్న చిన్న ఆనందాలను.. మళ్లీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం.