శరీరం తనలో ఉన్న అనారోగ్యాన్ని కొన్ని రకాల లక్షణాలు సంకేతాల ద్వారా బయటికి చూపిస్తుంది. చిన్న చిన్న మార్పులను మనం పట్టించుకోము. కానీ ఆ చిన్న చిన్న మార్పులే కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధులకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అమెరికాలో నివసించే లారెన్ కోల్డ్స్ అనే మహిళ కథ ఇలాంటిదే.
గోటిపై గీత పడితే
ఆమెకు తన ఎడమ చేతి బొటన వేలుపై కొన్ని నెలల క్రితం సన్నని గోధుమ రంగు గీత పడింది. మొదట్లో ఆ గీత లేదు ఆ తరువాత అది ప్రస్ఫుటంగా కనిపించడం మొదలైంది. చూసేందుకు కూడా అది వింతగా అనిపించింది. గోటిపై మందంగా ఉన్న ఆ గోధుమ రంగు గీతం ఆమె పెద్దగా పట్టించుకోలేదు. పిల్లల తల్లిగా ఉపాధ్యాయురాలుగా ఆమె తన జీవితాన్ని చాలా బిజీగా గడిపింది. ఒకసారి వైద్యుల వద్దకు వెళితే అతడు చర్మవ్యాధి నిపుణుడిని సందర్శించమని సలహా ఇచ్చాడు. కానీ ఆమె ఆ పని చేయలేదు.
ఒకరోజు సరదాగా టిక్ టాక్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తూ ఉంది. ఒక వీడియోలో డెర్మటాలజిస్ట్ గోటిపై ఇలాంటి గీతలు కనిపిస్తే విస్మరించవద్దని వెంటనే వైద్యుల్ని సంప్రదించమని చెప్పాడు. అది విన్న లారెన్ ఎందుకైనా మంచిదని డెర్మటాలజిస్టును కలిసింది.
బయాప్సీలో తేలింది
ఆమె గోటిపై ఉన్న జీతము చూసి డెర్మటాలజిస్ట్ కొన్ని రకాల పరీక్షలను చేయించాడు. బయాప్సీ కూడా చేయించారు. అందులో ఆమెకు మెలనోమా ఇన్ సిటు ఉందని తేలింది. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్ చర్మం పై భాగంలోనే ఈ క్యాన్సర్ కణాలు ఉన్నట్టు గుర్తించారు. లోపల భాగానికి ఇంకా వ్యాపించలేదు. అలా వ్యాపించి ఉంటే పరిస్థితి చేయి దాటిపోయేది. దీనిలో చికిత్సలో భాగంగా ఆమె ఎడమ చేతి బొటనవేలి గోరు మొత్తాన్ని తొలగించారు. క్యాన్సర్ కణాలు గోరులో మాత్రమే ఏర్పడ్డాయి. ఇంకా చర్మానికి గోటి లోపలి భాగానికి చేరలేదు. దీంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉంది. సకాలంలో క్యాన్సర్ ను గుర్తించారు. కాబట్టి ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదు.
గోటిపై పడిన చిన్న గీతలు కూడా శరీరంలోని అతిపెద్ద సమస్యను సూచిస్తాయి. కాబట్టి మీకు ఎలాంటి లక్షణాలు కొత్తగా కనిపించిన వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం అవసరం.