Summer Gardening Tips: ఇంట్లో మొక్కలు పెంచడం ఎంత ఇష్టమో, వాటిని సరిగ్గా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఎండాకాలంలో మొక్కలకు నీళ్లు పోసే విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. మొక్కలు ఎండిపోతున్నాయని కొందరు రోజుకు మూడు, నాలుగు సార్లు విపరీతంగా నీళ్లు పోస్తుంటారు. మరికొందరు ఏ సమయంలో పడితే ఆ సమయంలో నీళ్లు పోసి మొక్కలు చనిపోవడానికి కారణమవుతుంటారు. మొక్కలకు రోజుకు ఎన్నిసార్లు, ఏ పర్ఫెక్ట్ సమయంలో నీళ్లు పోయాలో, అసలు గార్డెనింగ్ నియమాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
మొక్కలకు నీళ్లు పోయడానికి రోజు మొత్తంలో బెస్ట్ సమయం ఉదయం పూట (ఉదయం 6 నుంచి 8 గంటల లోపు). ఉదయం పూట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి.. మనం పోసే నీటిని మొక్కల వేర్లు నిదానంగా, పద్ధతిగా పీల్చుకుంటాయి. అంతేకాకుండా.. పగలంతా వచ్చే ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఉదయం పోసే నీరు మొక్కలకు ఎనర్జీ బూస్టర్‌లా పని చేస్తుంది.
ఒకవేళ ఉదయం కుదరకపోతే.. సాయంత్రం వేళల్లో (5 గంటల తర్వాత) నీళ్లు పోయవచ్చు. అయితే.. సాయంత్రం పూట కేవలం కుండీల్లోని మట్టికి మాత్రమే నీరు ఇవ్వాలి. ఆకులపై ఎక్కువగా నీళ్లు చల్లకూడదు. ఎందుకంటే రాత్రిపూట ఆకులపై తేమ అలాగే ఉండిపోతే ఫంగస్ (బూజు) తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉందని మొక్కలపై నీళ్లు జల్లుతుంటారు. ఇది మొక్కలను చేజేతులా చంపేయడమే అవుతుంది. మధ్యాహ్నం వేడికి కుండీల్లోని మట్టి, లోపల ఉండే నీరు కూడా వేడెక్కుతాయి. ఆ సమయంలో మనం చల్లటి నీళ్లు పోస్తే వేర్లు షాక్‌కు గురై కుళ్ళిపోతాయి. పైగా ఆకులపై పడే నీటి చుక్కలు సూర్యరశ్మికి మగ్నిఫైయింగ్ గ్లాస్‌లా పనిచేసి ఆకులను పూర్తిగా కాల్చేస్తాయి. అందుకే మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొక్కలకు అస్సలు నీళ్లు పోయకూడదు.
1.మొక్కలకు రోజుకు ఎన్నిసార్లు నీళ్లు పోయాలనేది వాతావరణం, ఆ మొక్క రకంపై ఆధారపడి ఉంటుంది.
2.ఔట్‌డోర్ మొక్కలు (బాల్కనీ, టెర్రస్ మొక్కలు): ఎండాకాలంలో ఎండ నేరుగా తగిలే తులసి, గులాబీ, మల్లె వంటి మొక్కలకు రోజుకు రెండుసార్లు (ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి) నీళ్లు పోయాలి. చలికాలం, వర్షాకాలంలో రోజుకు ఒక్కసారి లేదా రోజు విడిచి రోజు పోస్తే సరిపోతుంది.
3. ఇండోర్ మొక్కలు (ఇంటి లోపల ఉండేవి): స్నేక్ ప్లాంట్, అలోవెరా, మనీ ప్లాంట్ వంటి వాటికి రోజువారీ నీరు అస్సలు అవసరం లేదు. వీటికి వారానికి ఒకటి లేదా రెండుసార్లు నీళ్లు పోస్తే చాలు.
మొక్కలకు నీరు పెట్టే ముందు ఎల్లప్పుడూ ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. దానినే ‘ఫింగర్ టెస్ట్’ (Finger Test) అంటారు. మీ వేలిని కుండీలోని మట్టిలో ఒక ఇంచు లోతుకు గుచ్చి చూడండి. మట్టి పొడిగా, గట్టిగా తగిలితేనే నీళ్లు పోయాలి. ఒకవేళ మట్టి ఇంకా తడిగా, మెత్తగా ఉంటే అస్సలు నీరు పోయకూడదు.
మొక్కల ఆకులు ఎండిపోయి కిందికి వంగిపోతే నీరు తక్కువైందని అర్థం. అలా కాకుండా ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే, మీరు అవసరానికంటే ఎక్కువ నీరు పోస్తున్నారని అర్థం. కుండీ కింద నీరు బయటకు వెళ్లడానికి డ్రైనేజీ హోల్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే.. మీ తోట ఎల్లప్పుడూ పచ్చదనంతో వికసిస్తుంది.