Karnataka Congress: ట్విస్ట్‌లు, టర్న్‌లు, సస్పెన్స్.. ప్రతి సీన్ క్లైమాక్స్‌లా ఉంటుంది కర్ణాటక కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇది నెవర్ ఎండింగ్ డైలీ సీరియల్‌గా మారింది ఈ వ్యవహారం. ఆరు నెలలకు ఒకసారి హస్తినకు పోయిరావాలే అన్నట్టుగా నేతలు హైకమాండ్ దగ్గరికి వెళ్లడం.. చర్చలు జరపడం.. అగ్ర నేతలు మళ్లీ అందరిని పిలిపించడం.. చర్చలు జరపడం.. ఏం జరగలేదు.. అంతా ఉట్టిదే అని చెప్పడం. ఇదంతా రోటిన్‌గా మారింది. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది.
ఉన్నట్టుండి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. అదే సమయంలో సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇంకేముంది మరోసారి సీఎం కుర్చీ పంచాయితీ తెర మీదకు వచ్చింది. ఈ ఊహాగానాలు మరింత బలపడటానికి మరో కారణం.. సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు పూర్తి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవర్‌షేరింగ్ ఫార్ములాతో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం జోరుగా జరిగింది. దానిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డీకే వర్గం, సీనియర్ నేత నాయకత్వంలోనే ఐదేళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకోవాల్సిందేనని సిద్దూ వర్గం అధిష్టానంపై ఒత్తిళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో అగ్ర నేతలతో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అవ్వడం.. ఇరువురు నేతలతో చర్చలు జరపడం.. ఆ తర్వాత ఆ ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరపడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇది సీఎం కుర్చీ కోసం జరుగుతున్న చర్చలు కాదు.. సిద్ధరామయ్య–డీకే మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించడం.. పార్టీ అంతర్గత సమతుల్యత, భవిష్యత్ రోడ్‌మ్యాప్‌పైనే చర్చిస్తున్నారని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలపై చర్చించామని తెలిపారు. ఏదేమైనా నాయకత్వం విషయంలో గందరగోళం, వరుస సమావేశాలు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కోల్డ్ వార్ పుణ్యమా అని కర్ణాటక రాజకీయం పీక్‌కి చేరింది.
శక్తిమంతమైన వొక్కలిగ సామాజికవర్గానికి చెందిన డీకే శివకుమార్.. తన సహనం నశించిందంటూ గతంలోనే రహస్య సంకేతాలిచ్చారు. మరోవైపు.. ఓబీసీ లీడర్ సిద్ధరామయ్య.. 2028 వరకు తానే సీఎంగా కొనసాగుతానని గట్టిగా చెబుతున్నారు. ఈ పొలిటికల్ డ్రామా అంతా.. సిద్ధరామయ్య సర్కార్ తన ఐదేళ్ల పదవీకాలంలో.. సగం పూర్తి చేసుకోవడంతో మొదలై.. ఇప్పుడు పీక్స్‌కు చేరింది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, శివకుమార్ క్యాంప్‌ల నుంచి ఢిల్లీ లెవెల్‌లో లాబీయింగ్ జోరుగా నడుస్తోంది.
కాలంలో ఆరు నెలలు ఒక్కసారి వెనక్కి వెళితే ఆ టైమ్‌లో డిప్యూటీ సీఎం డీకేకు విధేయులైన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు.. ఆయనకు ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పజెప్పాలంటూ.. ఢిల్లీ వెళ్లడంతో ఈ ఇష్యూ మరింత హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. రెండున్నరేళ్ల పాటు డీకే శివకుమార్‌ని.. సీఎంగా చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన హామీ ఏమైంది అనే చర్చ జరిగింది.
కర్ణాటక కాంగ్రెస్‌లో తలెత్తిన సమస్యని పరిష్కరించేందుకు.. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ సహా సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా అదే జరిగింది. మొత్తం హైకమాండ్ దీని గురించి చర్చించి.. ఈ గందరగోళానికి ముగింపు పలుకుతుందన్నారు. కానీ అలా జరగలేదు. మరి ఇప్పుడైనా అలా జరుగుతుందో లేదో చూడాలి.
అయితే ఈ సారి కొన్ని అంశాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా వినిపిస్తున్నాయి. 2028 ఎన్నికల దృష్ట్యా ఇప్పుడే నాయకత్వ మార్పు జరగాలని, డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నౌ ఆర్ నెవర్ అనే రేంజ్‌లో ఒత్తిడి తెస్తున్నారనేది ఒక చర్చ. మరోకటి జూన్‌లో కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 77 ఏళ్ల సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్రను అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఆయనను సీఎం కుర్చి నుంచి దిగిపోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
ఒకవేళ సిద్ధరామయ్య దిగిపోవాల్సి వస్తే, డీకే శివకుమార్ చేతికి పగ్గాలు వెళ్లకుండా సిద్ధూ వర్గం సరికొత్త వ్యూహం అమలు చేస్తోందనే ప్రచారం కూడా ఉంది. సిద్ధరామయ్యను మారిస్తే ఆ స్థానంలో దళిత ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
డీకే శివకుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. స్టేట్ కాంగ్రెస్ చీఫ్ కూడా. ఆయనే గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అధికారాన్ని పంచుకునే అంశంపై జరిగిన రహస్య ఒప్పందం గురించి.. పార్టీలో ఐదారు మందికి మాత్రమే తెలుసన్నారు. తనని సీఎంని చేయమని అడగలేదని.. ఇది తమలో ఐదారుగురు వ్యక్తుల మధ్య జరిగిన సీక్రెట్ అగ్రిమెంట్ అన్నారు. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన వ్యూహకర్త డీకే.. ఒక్కొక్కటిగా తన ఎత్తుగడలన్నింటిని వేస్తున్నారు. అంతిమంగా పైకి అంతా బాగుందని ప్రకటించినా.. అంతర్గతంగా ఈ చర్చ కొనసాగుతుందని తెలుస్తోంది. ముందు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కర్ణాటకలో ఇలాంటి కుర్చీ పంచాయితీ రావడం ఇదే తొలిసారి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే సీఎం ఎవరనేదానిపై మొదటి పంచాయితీ మొదలైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ పట్టుబట్టడంతో ఢిల్లీలో హైకమాండ్ ఐదు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపింది. చివరికి సిద్ధరామయ్యను సీఎంగా, డీకేను ఏకైక డిప్యూటీ సీఎంగా ప్రకటించి అప్పటికి సర్దిచెప్పారు.
ఆ తర్వాత గతేడాది చివర్లో మరోసారి ఈ పంచాయితీ జరిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో డీకే శివకుమార్ వర్గం మళ్లీ సీఎం కుర్చీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. డీకే శివకుమార్ స్వయంగా రహస్య ఒప్పందం గురించి మాట్లాడటంతో వివాదం ముదిరింది. అప్పట్లో అధిష్ఠానం జోక్యం చేసుకుని ఇద్దరు నేతలతో వరుస బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు నిర్వహించి, బహిరంగ ప్రకటనలు చేయవద్దని కట్టడి చేసింది.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కొనసాగుతోంది ఈ పంచాయితీ. ఇప్పుడు కూడా సేమ్ స్క్రిప్ట్. అవే భేటీలు.. బ్రెస్‌ఫాస్ట్ మీట్‌లు.. అంతా సవ్యంగానే ఉందనేలా ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది. కానీ వీటన్నింటి వల్ల కాంగ్రెస్ పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరుగుతూనే ఉంది. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి సంబంధించిన పవర్ షేరింగ్ కాంట్రవర్సీ ప్రతిసారి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. భారత్‌లోని అతిపెద్ద రాష్ట్రాల్లో.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అరుదైన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంపై అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు.. కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కర్ణాటకలో పరిస్థితులు బాలేవు. ఐటీ క్యాపిటల్‌గా భావించే బెంగళూరులో.. కాంగ్రెస్ హయాంలో ఐటీ సంబంధిత కార్యకలాపాలు తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఈ ఎఫెక్ట్ క్రమంగా సర్కార్ మీద పడుతుంది. తర్వాత అది నేరుగా ఢిల్లీకి రిఫ్లెక్ట్ అవుతుంది. కర్ణాటక ప్రభుత్వంలో పదవుల కోసం ఈ కుమ్ములాటలు, పార్టీలో అంతర్గత పోరు, ప్రభుత్వంలో సఖ్యతో లేకపోవడం లాంటి అంశాలన్నీ.. రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయనే చర్చ ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇక్కడ జరిగే డ్యామేజ్.. ఇండియా లెవెల్లో కాంగ్రెస్ ఇమేజ్‌ని దెబ్బకొడుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పైగా దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే. ఈ మధ్య కూటమిలో కీలక పాత్ర పోషించి కేరళను కూడా దక్కించుకుంది. ఈ అన్ని రాష్ట్రాల్లో పెద్దది కర్ణాటకనే. అందువల్ల ఇప్పుడు తలెత్తిన సంక్షోభంలో.. అంతర్గత విభేదాలను పరిష్కరించుకోలేకపోతే.. అది పార్టీకి నష్టం చేయడం ఖాయమంటున్నారు.
ఈ నాయకత్వ మార్పుతో మొదలైన పోరు వల్ల.. మంత్రులు, ఎమ్మెల్యేల్లో గందరగోళం నెలకొంది. ఇది.. ప్రభుత్వ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రభావం చూపుతుంది. పరిపాలన స్థిరంగా లేదనే భావన ప్రజల్లోకి వెళితే.. అది భవిష్యత్తుల్లో కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుంది. ప్రతిపక్ష బీజేపీకి ఈ అంతర్గత కుమ్ములాటలు ఓ బలమైన ఆయుధంగా మారాయి. స్థిరమైన పాలన ఇవ్వలేని పార్టీగా.. కాంగ్రెస్‌ని విమర్శిస్తున్నారు. మెజారిటీతో అధికారంలోకి వచ్చినా.. సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య మొదలైన ఈ పవర్ షేరింగ్ పోరుకు.. అధిష్టానం గనక వెంటనే చెక్ పెట్టకపోతే.. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌పై పెట్టుకున్న విశ్వాసం సన్నగిల్లిపోతుంది. కాంగ్రెస్ ఉంటే.. ఎప్పుడూ ఇంతేనన్న నిర్వేదం వారిలో తలెత్తే అవకాశం ఉంది.
కర్ణాటకలో రాజుకున్న రాజకీయ వేడి తాలూకూ సెగ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ని తాకింది. ఇది అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. క్లియర్ స్టాండ్ లేకపోవడం వల్లే.. డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేసే పరిస్థితులొచ్చాయ్. ఇది పార్టీలో హైకమాండ్ పట్టు కోల్పోయిందనే సంకేతాన్ని పంపింది. అంతేకాదు కర్ణాటకకు చెందిన కొందరు నాయకులు.. జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న మల్లికార్జున ఖర్గే.. కర్ణాటకకు చెందిన నేతే కావడంతో.. ఇష్యూ మరింత చర్చనీయాంశమవుతోంది. అట్లాంటి రాష్ట్రంలో ఇట్లాంటి సంక్షోభం నెలకొంటే.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తే చాన్స్ ఉంది. ఇలాంటి అంతర్గత విభేదాల కారణంగానే.. గతంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. కర్ణాటక సంక్షోభంపై హైకమాండ్ వెంటనే ఏదో ఒకటి తేల్చకపోతే.. హస్తం పార్టీ అస్తవ్యస్తమవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
కర్ణాటక రాజకీయ సంక్షోభం.. కేవలం కర్ణాటక కాంగ్రెస్‌కి సంబంధించిన సమస్య కాదు. ఇండియా లెవెల్లో.. పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. పవర్ షేరింగ్ విషయంలో.. అధిష్టానం తక్షణమే స్పష్టమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. పవర్ షేరింగ్ ఫార్ములా ఉందా? లేదా? అనే విషయంపై ఉన్న గందరగోళాన్ని తొలగించాలి. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు.. ఒక బలమైన సందేశాన్ని ఇవ్వగలిగితేనే కాంగ్రెస్ తన ఇమేజ్‌ని కాపాడుకోగలదు. లేకపోతే.. అంతర్గత కలహాలతో చెదిరిపోయే పార్టీగా మరోసారి ముద్ర వేసుకొని.. ప్రత్యర్థులకు మరింత బలం చేకూరేందుకు కారణమవుతుంది.
Also Read: బాల్క సుమన్ ‘మిలిటెంట్’ రాజకీయం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసమా? సెల్ఫ్ గోలా?
Story by: Anup, Big Tv