Weak Immune System: మన శరీరాన్ని వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేది రోగ నిరోధక వ్యవస్థ. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇతర హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడుతుంది. అయితే.. కొన్ని కారణాల వల్ల ఈ వ్యవస్థ బలహీనపడి, మనం తరచుగా అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనపడటానికి ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పోషకాహార లోపం:
మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి, జింక్ , సెలీనియం వంటి పోషకాల లోపం రోగ నిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల శరీరం అవసరమైన పోషకాలను కోల్పోతుంది.
2. దీర్ఘకాలిక ఒత్తిడి :
నిరంతర ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మన శరీరం ‘కార్టిసాల్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీర్ఘకాలికంగా ఈ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది రోగ నిరోధక వ్యవస్థ పనితీరును అణిచివేస్తుంది. ఫలితంగా.. శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థవంతంగా పోరాడలేదు.
3. నిద్రలేమి:
మనం నిద్రపోయినప్పుడు.. శరీరం రోగ నిరోధక కణాలను, సైటోకైన్స్ అనే ప్రోటీన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్లు , వాపులతో పోరాడటానికి సహాయ పడతాయి. తగినంత నిద్ర లేకపోతే.. ఈ కీలకమైన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయి రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది.
4. వ్యాయామం లేకపోవడం:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోగ నిరోధక కణాలు శరీరంలో వేగంగా కదులుతాయి. దీని వల్ల వ్యాధులను ఎదుర్కోవడానికి శరీరం మరింత సిద్ధంగా ఉంటుంది.
5. అధిక బరువు:
అధిక బరువు ఉన్నవారిలో కొవ్వు కణాలు సైటోకైన్స్ వంటి ప్రోటీన్లను అతిగా ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరంలో దీర్ఘకాలిక వాపుకు దారితీస్తుంది. ఈ వాపు రోగనిరోధక వ్యవస్థను నిరంతరం అలసిపోయేలా చేసి.. దాని పనితీరును తగ్గిస్తుంది.
6. ఆటోఇమ్యూన్ వ్యాధులు:
ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నప్పుడు.. రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలనే దాడి చేస్తుంది. ఉదాహరణకు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధులు రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
7. కొన్ని రకాల మందులు:
కొన్ని మందులు, ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్స్, కీమోథెరపీ మందులు లేదా అవయవ మార్పిడి తర్వాత ఇచ్చే మందులు రోగ నిరోధక శక్తిని అణచివేస్తాయి.
Also Read: యోగాతో బోలెడు బెనిఫిట్స్.. ఈ రోజే ప్రారంభించండి మరి !
8. వయస్సు:
వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సహజంగానే బలహీనపడుతుంది. దీనిని ‘ఇమ్యునోసెనెసెన్స్’ అంటారు. అందుకే వృద్ధులు తరచుగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలంటే.. పైన పేర్కొన్న అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయ పడతాయి. మీకు తరచుగా అనారోగ్యం వస్తున్నట్లయితే.. డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.