రైల్వే స్టేషన్లలో, కదులుతున్న రైళ్లలో మహిళల పట్ల ఎలాంటి అనుచిత ప్రవర్తనకు దిగినా కఠిన చర్యలు తప్పవని రైల్వే పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మద్యం మత్తులో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురుచూస్తున్న మహిళను అనుచితంగా తాకడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సదరు యువకుడిని పోలీసులు అదుపులోని తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని బోరివ్లి రైల్వే స్టేషన్ లో జరిగింది.
ముంబైలో ఉంటున్న ఓ మహిళ తల్లి చనిపోయింది. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నాగ్ పూర్ వెళ్లాలని.. బోరివ్లి రైల్వే స్టేషన్ కు వచ్చింది. తెల్లవారుజామున 1.30 సమయంలో ఆమె మూడో నెంబర్ ప్లాట్ ఫ్లారమ్ మీద కూర్చొని ఉంది. అదే సమయంలో ఓ యువకుడు రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే తను ఓ పార్టీకి వెళ్లి ఫుల్ గా మద్యం తాగి ఉన్నాడు. రైల్వే స్టేషన్ లో కొంత మంది ప్రయాణీకులు కూడా ఉన్నాడు. నేరుగా నిందితుడు ఆమె దగ్గరికి వచ్చి పక్కనే బెంచీ మీద కూర్చున్నాడు. ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా ఆమెను టచ్ చేశాడు. సదరు మహిళ వద్దని వారిస్తున్నప్పటికీ అలాగే చేశాడు. తాకకూడని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు.
యువకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు చేసిన పని గురించి చెప్పింది. పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. సదరు యువకుడిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్ 74 (మహిళపై దాడి, నేరపూరిత బలప్రయోగం) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాగ్ పూర్ రైలు ఎక్కడానికి స్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. “ఒక ప్రొడక్షన్ హౌస్ లో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశాం. మహిళను అతడు లైంగికంగా వేధించిన వీడియో ప్లాట్ ఫారమ్ లోని సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. దాని ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నాం” అని జిఆర్‌పి అధికారులు తెలిపారు.
మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి, GRP ఇప్పటికే రైళ్లలో 640 మంది సిబ్బందిని మరియు ప్లాట్‌ఫారమ్‌లపై 600 మందికి పైగా సిబ్బందిని నియమించిందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ మహిళా ప్రయాణీకులు భద్రతా సిబ్బంది లేరని గమనిస్తే, వెంటనే రైల్వే హెల్ప్ లైన్ 1512కు కాల్ చేయవచ్చన్నారు. ప్రయాణీకుల భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని వెల్లడించారు.
Read Also: పక్కనే కూర్చొని మైనర్ బాలికను.. ఛీ, ఎద్దులా పెరిగావ్ బుద్ధిలేదా?