భారత్ లో దీపావళి వేడుకలు ఎంత ఘనంగా జరపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్లన్నీ దీపాలతో అలంకరించుకుని, నరకాసురుడి బొమ్మను దహనం చేసి, ఇంటిల్లిపాదితో చక్కగా లక్ష్మీ పూజ చేసుకుంటారు. సాయంకాలం వేళ అంతా కలిసి చక్కగా క్రాకర్స్ కాల్చుతూ ఎంజాయ్ చేస్తారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుని నోటిని తీపి చేస్తుకుంటారు. దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. సౌత్ లో దీపావళి బాగానే జరుపుకున్నప్పటికీ, నార్త్ ఇంకా బాగుంటుంది. అయితే, ఈ మధ్య విదేశాల్లోనూ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ వేడుకలు కనువిందు చేస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో అట్టహాసంగా జరపుకుంటున్న దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి ఇది ఆస్ట్రేలియానా? లేక ఇండియానా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఆస్ట్రేలియాలో దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో ‘ఇండియన్స్ ఇన్ యూరప్’ అనే ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు. ఇందులో ఆస్ట్రేలియాలోని ఓ వీధి వీధంతా విద్యుత్ వెలుగులతో అత్యంత అందంగా ముస్తాబు చేశారు. ఆ స్ట్రీట్ లోని అన్ని భవనాలు కనువిందు చేసేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇల్లు రంగురంగుల ఫెయిరీ లైట్లు, ఇతర అలంకరణ వస్తువులను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇది ఇండియాలోని వీధి అనేటట్లుగా తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యులు అంతా ఇంటి బయట నిలబడి సంతోషంగా గడుపుతూ కనిపించారు. దీపావళి వేళ ఒక భారతీయ వీధి ఇంతగా వెలిగిపోవడం కొత్త విషయం కాదు. కానీ, ఆ వీధి ఆస్ట్రేలియాలో ఉండటం విశేషం. భారతీయ కుటుంబాలు రాముడు, హనుమంతుడి స్టైల్ లో లైటింగ్స్ డెకొరేట్ చేశారు. శివుడి అలంకరణ కూడా కనిపించింది.
ఆస్ట్రేలియాలో దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో నెట్టింట క్షణాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 5 లక్షలకు పైగా లైక్స్, వేలాది కామెంట్లు వచ్చాయి. “ఇది నిజంగా ఆస్ట్రేలియాలా లేదు. ఇండియాలోని మోడ్రన్ స్ట్రీట్ లా కనిపిస్తోంది. నిజంగా భారతీయులు విదేశాల్లో ఇంత గొప్పగా దీపావళి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “దీపావళి పండుగ వేళ ఇళ్లను విద్యుత్ కాంతులతో అలంకరించే పోటీ జరుగుతున్నట్లు కనిపిస్తుంది” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. “విదేశాల్లో స్థిరపడినప్పటికీ, తమ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలను మర్చిపోకుండా, ప్రతి ఏటా మరింత ఘనంగా జరుపుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం. ఈ వీడియోను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా విదేశాల్లోనూ దీపావళి సంబురాలు అంబరాన్ని అంటడం పట్ల ఇక్కడి ప్రజలు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Read Also: బెంగళూరులో చీకట్లు, ఢిల్లీలో వెలుగులు.. దీపావళిలో ఇంత తేడా ఉందా?