దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ COVID-19 కేసుల సంఖ్య 3,000 దాటింది, తాజా వేవ్‌లో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, శనివారం ఉదయం నాటికి దేశంలో 3,395 యాక్టివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. ఇది గత వారం కంటే దాదాపు 1,200 శాతం ఎక్కువ. దేశంలో మే 22న 257 యాక్టివ్ కేసులు ఉండగా, మే 26 నాటికి 1,010 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం, శనివారం మధ్య 685 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నలుగురు చనిపోయినట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కేరళలో శుక్రవారం 189 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం1,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (467), ఢిల్లీ (375), గుజరాత్ (265), కర్ణాటక (234), పశ్చిమ బెంగాల్ (205), తమిళనాడు (185), ఉత్తరప్రదేశ్ (117) రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (60), పుదుచ్చేరి (41), హర్యానా (26), ఆంధ్రప్రదేశ్ (17), మధ్యప్రదేశ్ (16) కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 26 మంది చనిపోయారు.
దేశంలో కరోనా పెరుగుదలకు కారణాలు
భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కొత్త కరోనా వేవ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో నమూనాల జన్యు శ్రేణి కొత్త వైవిధ్యాలను కనుగొన్నట్లు వివరించింది. 2022లో దేశంలో కోవిడ్ వేవ్‌కు కారణమైన ఓమిక్రాన్ జాతి సరికొత్తగా రూపాంతరం చెందినట్లు వెల్లడించింది. ఇవి LF.7, XFG, JN.1, NB.1.8.1గా పిలుస్తున్నట్లు ICMR చీఫ్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ తెలిపారు. వీటిలో మొదటి మూడు వేరియెంట్లు బలంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో కరోనా కేసులు సౌత్ నుంచి పశ్చిమం వైపు వెళ్లి ఇప్పుడు ఉత్తర భారతానికి చేరినట్లు వెల్లడించారు. ఈ కేసులన్నీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
భయపడాల్సిన అవసరం లేదా?
ప్రస్తుతం నమోదవుతున్న కరోనా విషయంలో పెద్దగా చింతించాల్సిన పని లేదని డాక్టర్ బ్లెహ్ వెల్లడించారు. ఇన్ఫెక్షన్ల తీవ్రత సాధారణంగా ఉందన్నారు. ఆందోళన చెందే విషయం ఏమీ లేదన్నారు. “కేసులు పెరిగినప్పుడల్లా, మేము మూడు విషయాలను పరిశీలిస్తాము. మొదటిది ఎంతగా వ్యాపిస్తుంది అనేది పరిశీలన చేస్తాం. గతంలో COVID-19 కేసులు రెండు రోజుల్లో రెట్టింపు అయ్యాయి. కానీ, ఈసారి తీవ్రత తక్కువగా ఉంది. రెండవది, కొత్త వేరియంట్‌లు మన మునుపటి రోగనిరోధక శక్తిని తప్పించుకుంటున్నాయా? అనేది పరిశీలిస్తాం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు, అవి రోగనిరోధక శక్తిని తప్పించుకుంటాయి. కానీ, ప్రస్తుతానికి ఆందోళన చెందడానికి ఏమీ లేదు. మూడవ మనకు కోమోర్బిడిటీలు లేకుండా తీవ్రమైన వ్యాధి వస్తుందా? అనేది గమనిస్తాయం. ప్రస్తుతానికి, తీవ్రత సాధారణంగా తక్కువగా ఉంది. ఆందోళన చెందడానికి ఏమీ లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి” అని బ్లెహ్ వెల్లడించారు.
కరోనా విజృంభణపై WHO ఏం చెప్పిందంటే?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గత నెలలో LF.7, NB.1.8.1 సబ్ వేరియంట్లను పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లుగా గుర్తించింది. NB.1.8.1 ఇతర వేరియంట్‌ల కంటే తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని సూచించడం లేదని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్‌లు ప్రస్తుతం వ్యాధిని అరికట్టే అవకాశం ఉందని తెలిపింది.
Read Also: చెంప దెబ్బతో చికిత్స.. చర్మం యవ్వనంగా ఉండాలంటే ఇలా చెయ్యాలట!