గతేడాది జూన్-4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని వైసీపీ నిర్ణయంచింది. పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది. దీనికి కౌంటర్ గా కూటమి ‘పీడ విరగడైంది’ పేరుతో అదే రోజు ఉత్సవాలు జరపాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఇది జనసేన నిర్ణయం. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో మంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. జనసైనికులతోపాటు కూటమి నేతలంతా ‘పీడవిరగడైంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వెన్నుపోటు..
ఇటీవల లిక్కర్ స్కామ్ గురించి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్.. చివర్లో జూన్-4న వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపడతాయని పిలుపునిచ్చారు. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన జరగనుంది. జూన్-4న ఎన్నికల ఫలితాలు రావడంతో అదే రోజు వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామంటున్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, అదే ప్రజలకు వారు పొడిచిన వెన్నుపోటు అంటున్నారు వైసీపీ నేతలు. ఈ మేరకు ఈ కార్యక్రమం కోసం ప్రతి జిల్లాలో వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆరోజు నాయకులంతా కలెక్టరేట్లకు వెళ్లి అక్కడ వినతిపత్రాలు ఇస్తారు. అనంతరం నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు ఉంటాయి.
కూటమి కౌంటర్..
వాస్తవానికి కూటమి పాలనకు ఏడాది అంటే అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచి మొదలు కావాలి. కానీ వెన్నుపోటు అంటూ వైసీపీ ముందుగానే హడావిడి మొదలు పెట్టడంతో కూటమి నేతలు కూడా తమ కార్యక్రమాలను ముందుకు మార్చుకున్నారు. ఫలితాలు వచ్చిన రోజే తాము ‘పీడ విరగడైంది’ అనే కార్యక్రమం చేస్తామంటున్నారు. ఆ రోజు ఏపీ ప్రజలకు వైసీపీ ‘పీడ విరగడైంది’ అనేది వారి అభిప్రాయం. అప్పటి నుంచి ప్రజలకు మంచి పాలన అందుతోందని కూటమి నేతలు చెబుతున్నారు. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండగ జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.
JanaSena exclusive campaign on June 4th !
•4వ తేదీన ‘రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఏడాది’ కార్యక్రమం
•ఉదయం సంక్రాంతి ఉట్టిపడేలా, సాయంత్రం దీపావళి కాంతులు కనపడేలా కార్యక్రమాలు pic.twitter.com/8H6mvZtF2o
— JanaSena Party (@JanaSenaParty) June 1, 2025
ఈ కార్యక్రమాలకు జనసేన లీడ్ తీసుకోవడం ఇక్కడ విశేషం. డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో.. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దిశా నిర్దేశం చేసింది. ఆ రోజు జనసేన నేతలు, శ్రేణులు తమ వాకిళ్లను అందమైన రంగవల్లులతో అలంకరించాలనీ, ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాలనీ పార్టీ ఆదేశించింది. సాయంత్రం దీపావళి తరహాలో దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చాలని నేతలకు సూచించారు. అంటే ఇక్కడ సంక్రాంతి-దీపావళి కలిపి నిర్వహించాలనేది వారి ముఖ్య ఉద్దేశం. ఈ వేడుకల ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిపోవాలని కూడా సూచనలు అందాయి. డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలు వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని మరచిపోవాలని, దానికి తగ్గట్టుగా ట్రెండింగ్ మొదలు పెట్టాలని కూడా జనసైనికులకు ఆదేశాలందాయి. మరోవైపు వెన్నుపోటు దినోత్సవానికి రెడీ అవుతున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ వెన్నుపోటు దినోత్సవానికి సహజంగానే అనుమతులు లభించవు. అనుమతులు లేకుండా రోడ్డెక్కితే పోలీసులు చూస్తూ ఊరుకోరు. అంటే.. జూన్-4న ఏపీలో పెద్ద రణరంగమే జరగబోతోందని తేలిపోయింది.