ఈ రోజుల్లో చాలా మంది చర్మ సౌందర్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయిల్ తో మర్దన చేసుకోవడం, సంప్రదాయ పద్దతులను పాటించడం ద్వారా చర్మానికి అదనపు మెరుగులను పొందుతున్నారు. అలాంటి పద్దతుల్లో ఒకటి స్లాప్ థెరపీ. ముఖం మీద ముడతలు రాకుండా ఉండేందుకే ఈ థెరపీని పరిచయం చేశారు. కానీ, ఆ తర్వాత శరీరం అంతా అదనపు మెరుపును పొందేందుకు ఇదే పద్దతిని ఉపయోగిస్తున్నారు. ఇంతకీ స్లాప్ థెరపీ అంటే ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి?
చైనా సంప్రదాయ థెరపీ
నిజానికి ఈ పద్దతిని చైనాలో పైడా లాజిన్ (Paida Lajin) అని పిలుస్తారు. ఈ పద్ధతిని కొందరు చర్మ సౌందర్యం కోసం ఉపయోగిస్తారు. బెడ్ మీద పడుకోబెడ్డి శరీరం అంతా మీద నెమ్మదిగా చేతులతో కొడతారు. కండరాలను సాగదీసే ప్రయత్నం చేస్తారు. ఈ విధానాన్ని హాంగ్చీ షియావో నిపుణుడు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఇది సాంప్రదాయ చైనీస్ వైద్యం తావోయిజం, బౌద్ధ సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది.
స్లాప్ థెరపీ ద్వార టైట్ స్కిన్ ఎలా?
ఈ పద్దతి ద్వారా ముఖం మీద లేదంటే శరీరం మీద తేలికగా చేతులతో కొడతారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అదే సమయంలో చర్మం కింది కణజాలం ఉత్తేజితం అవుతుంది. టాక్సిన్స్ పూర్తిగా బయటకు వెళ్తాయి. దీని వల్ల ముఖంతో పాటు శరీరం అంతటా చర్మం బిగుతుగా మారుతుంది. ముడతలు పూర్తిగా మాయమై యవ్వనంగా కనిపిస్తారు. సాధారణంగా ముఖం మీద 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా రెండు చేతులతో చప్పట్ల మాదిరిగా చరుస్తారు. ఆ తర్వాత మాయిశ్చరైజర్ లేదంటే ఫేస్ ఆయిల్ ఉపయోగించి మరోసారి కొడతారు. ఇలా రోజూ చేస్తే చర్మం ఎరుపెక్కి, బిగుతుగా మారుతుందని భావిస్తారు. ఈ విధానాన్ని సహజమైన ఫేస్ లిఫ్ట్ గా పిలుస్తారు. ముఖం మీద రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరిసే అవకాశం ఉందంటారు.
శాస్త్రీయంగా నిరూపితం అయ్యిందా?
నిజానికి స్లాప్ థెరపీ చర్మాన్ని బిగుతుగా చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల తాత్కాలికంగా చర్మం మెరుస్తుంది. కానీ, దీర్ఘకాలికంగా ముడతలు తగ్గడం, చర్మం బిగుతుగా మారడం గురించి ఎటువంటి పరిశోధనలు కూడా వెల్లడించలేదు. పైగా ఎక్కువగా కొడితే చర్మం ఎరుపెక్కడం, గాయపడటం, రక్తనాళాలు పగిలిపోవడం లాంటి ప్రమాదం కలుగుతుంది. స్లాప్ థెరపీ వైద్యపరంగానూ ఆమోదించబడలేదు. 2016లో డేనియల్ కార్ గామ్ అనే మహిళ ఈ థెరపీ సమయంలో ఇన్సులిన్ మానేసి చనిపోయింది. థెరపిస్ట్ హాంగ్చీ షియావోకు పోలీసులు ఏకంగా 10 సంవత్సరాల జైలు శిక్ష వేశారు. చర్మ సౌందర్యం కోసం ఈ థెరపీ బెస్ట్ అనే ప్రచారం ఉన్నా, స్కిన్ స్పెషలిస్టులు ఈ విధానాన్ని సిఫార్సు చేయడం లేదు. చర్మం అందంగా మారేందుకు మాయిశ్చరైజర్స్, మసాజ్ తో పాటు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read Also: ఆ నటి స్నానం నీటితో సబ్బులు తయారీ.. ఒక్కో సోప్ ధర ఎంతో తెలుసా?