ఆసుపత్రికి వెళ్తే పెద్ద పెద్ద బ్యానర్లపై ‘రక్త దానం గొప్ప దానం’ అని రాసి ఉంటుంది. రక్తదానం చేయడం అనేది ఇతరులను ప్రాణాలను కాపాడే గొప్ప పని. అయితే చాలామంది రక్తదానం చేయడానికి వెనకాడుతూ ఉంటారు. దానివల్ల తనకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటారు. అందుకే రక్తదానం చేసేందుకు ఇష్టపడరు. అయితే క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిలో క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం అంటే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ వ్యాధులను తగ్గిస్తుంది
రక్తదానం చేయడం వల్ల ఎదుటివారి ప్రాణాలను కాపాడటమే కాదు.. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వాటిని అడ్డుకొని మీ ప్రాణాన్ని కూడా మీరు కాపాడుకోవచ్చు. లండన్ లోని ఫ్రాన్సిస్క్రిక్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న వ్యక్తులకు లుకేమియా వంటి రక్తసంబంధిత క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా తగ్గినట్టు తేలింది. రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. తద్వారా ప్రమాదకరమైన మ్యుటేషన్ లా ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.
గుండె జబ్బులు రావు
రక్తదానం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే ఇనుము స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. అధిక ఇనుము శరీరంలో ఇన్ఫ్లమేషన్‌కు, ఆక్సీకరణ ఒత్తిడికి కారణం అవుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణం అవుతుంది. రక్తదానం చేయడం వల్ల ఇనుము ఎంత కావాలో అంత మాత్రమే శరీరంలో ఉంటుంది.
క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారికి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రక్తపోటు క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి.
ప్రతిసారీ రక్తదానం చేసే ముందు చిన్న ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం అలవాటుగా మార్చుకోండి. దానిలో మీ రక్తపోటు ఎంత ఉంది హిమోగ్లోబిన్, పల్స్ వంటివన్నీ తనిఖీ చేస్తారు. ఇవన్నీ సరిగా ఉంటే మీరు సంతోషంగా రక్తదానం చేయవచ్చు. తద్వారా మీరు కూడా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
రక్తదానం ఎవరు చేయకూడదు?
రక్తదానం అందరూ చేసేందుకు అర్హులు కాదు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు, 65 ఏళ్ల కన్నా వయసు కన్నా ఎక్కువ ఉన్నవారి నుంచి రక్తాన్ని సేకరించరు. అలాగే హిమోఫెలియా, అధిక రక్తపోటు, మధుమేహం, హెచ్ ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడేవారు రక్తదానం చేయకూడదు.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు 12.5 శాతం కన్నా తక్కువ ఉన్నవారి నుంచి రక్తాన్ని సేకరించరు. లైంగిక వ్యాధులు ఉన్న వారు కూడా రక్తదానం చేయడానికి అర్హలు కాదు. 45 కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న వారు కూడా రక్తదానం చేయకూడదు.