Heroine:ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ దొంగతనాల కారణంగా కొంతమంది దొంగల ముఠా ఏకంగా సెలబ్రిటీల పైన దాడికి దిగుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇంట్లో జరిగిన దాడి ఇంకా మరువకముందే.. ఇప్పుడు మరొక నటి ఇంట్లో దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లక్షల విలువైన నగలు దోచుకుపోయారు. ఇక ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి నేహా మాలిక్ (Neha Malik). మోడల్ గా కెరియర్ ఆరంభించిన నేహా మాలిక్ ఆ తర్వాత నటిగా పేరు సొంతం చేసుకుంది. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తన 37 ఏళ్ల పనిమనిషి షహనాజ్ ముస్తఫా షేక్ పై నటి నేహా దొంగతనం ఆరోపణలు చేసింది. ఈ దొంగతనం ఏప్రిల్ 25న జరిగినట్లు తెలుస్తోంది. ఇక పనిమనిషి దాదాపు రూ.34.49 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లినందని తన ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎఫ్ఐఆర్లో అందించిన వివరాల మేరకు..
ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన వివరాల మేరకు.. నేహా మాలిక్ తల్లి మంజు (Manju) ఫంక్షన్లకు బంగారు నగలు ధరించి, ఇంటికి తిరిగి వచ్చాక.. వాటిని తీసి తన బెడ్ రూమ్ లో ఉన్న చెక్క డ్రాయర్ లో పెట్టేవారు. దానికి తాళం కూడా ఉండేది కాదు.. మలాడ్ వెస్ట్ లో ఉండే వారి పనిమనిషి షహనాజ్ ముస్తఫా షేక్ కి మాత్రమే ఈ విషయం తెలుసు. ఎందుకంటే మంజు చాలా సార్లు ఆమె ముందే నగలు ధరించి తీసి డ్రాయర్లో ఉంచేవారట. మాలిక్ కుటుంబం షహనాజ్ ముస్తఫా షేక్ కి ఇంటికి ఒక తాళం ఇచ్చారని, వారు ఇంట్లో లేనప్పుడు ఆమె తలుపు తెరిచి పనిచేసుకునేందుకు వీలుగా ఉండేలా తాళం కూడా ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో ఉంది. ఏప్రిల్ 25న ఉదయం 7:30 నుండీ 9:00 గంటల మధ్య నేహా షూటింగ్ కి వెళ్ళింది. ఈమె తల్లి మంజు గురుద్వారాకు వెళ్ళింది. ఒంటరిగా ఉన్న పనిమనిషి ఆ తర్వాత రోజు పనికి రాలేదు. ఆ తర్వాత నేహా కి తన బంగారు ఆభరణాలు కనిపించలేదు.. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే ఆ పనిమనిషిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేహా మాలిక్..
ఇక నేహ మాలిక్ విషయానికి వస్తే.. నటి మాత్రమే కాదు మోడల్ కూడా.. బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించిన ఈమె.. 2012 నుండి ఫిలిం మోడలింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు సమాచారం.గాంధీ ఫేర్ ఆ గయా, ముసాఫిర్ 2020, పింకీ మోగేవాలి 2 వంటి కొన్ని సినిమాలలో నటించింది. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. సుమారుగా నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది.
also read:Bollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఫ్యామిలీ మ్యాన్ నటుడు మృతి..!