Custard Apple: చలికాలం వచ్చిందంటే గుర్తొచ్చే రుచికరమైన పండ్లలో సీతాఫలం ఒకటి. దీనిని దీనిని ‘పేదవాడి ఆపిల్’ అని కూడా పిలుస్తారు. తీయని రుచి, కమ్మని సువాసనతో పాటు.. సీతాఫలంలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దీని పండ్లు, ఆకులు, బెరడు కూడా వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. సీజనల్ ఫ్రూట్ అయిన ఈ సీతాఫలాన్ని తీసుకోవడం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
1. రోగనిరోధక శక్తిని పెంపొందించడం :
సీతాఫలంలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
2. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం :
ఈ పండులో పీచు పదార్థాలు (ఫైబర్) అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సీతాఫలంలోని కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. దీనిని తీసుకోవడం వలన మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. గుండె, రక్తపోటు నియంత్రణ:
సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పొటాషియం రక్తనాళాలను సడలించి, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం గుండె కండరాలకు విశ్రాంతిని ఇచ్చి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే..ఇందులో ఉండే నియాసిన్ , డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.
4. రక్తహీనత నివారణ:
రక్తహీనతతో బాధపడేవారికి సీతాఫలం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి, ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. తద్వారా రక్తహీనతను నివారిస్తుంది. ఇది నిస్సత్తువ (అలసట)ను కూడా దూరం చేస్తుంది.
Also Read: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?
5. మానసిక ప్రశాంతత:
ఈ పండులో విటమిన్ బి6 (పైరిడాక్సిన్) అధికంగా ఉంటుంది. ఇది ‘సెరోటోనిన్’, ‘డోపమైన్’ వంటి హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. వీటిని సంతోషకరమైన హార్మోన్లు అని కూడా అంటారు. అందుకే.. సీతాఫలం తినడం వలన ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. చర్మం, కళ్ళ ఆరోగ్యం:
సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయ పడతాయి. ఇందులో ఉండే విటమిన్-ఎ కంటి చూపును మెరుగు పరచడంలో.. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే లుటిన్ అనే శక్తివంతమైన యాంటీఆ క్సిడెంట్ కళ్ళను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.