Health Tips: ఉసిరి, నల్ల మిరియాలు, స్వచ్ఛమైన తేనెతో కూడిన మిశ్రమం.. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక సంప్రదాయ ఔషధం. ఈ మూడు పదార్థాలు వాటి స్వంత గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండగా.. వీటిని కలిపి తీసుకోవడం వలన ఆ ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. నిత్యం మూడు పూటలా.. మూడు స్పూన్ల చొప్పున ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి, నల్ల మిరియాలు, తేనెతో అద్భుత ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తిని పెంపొందించడం :
ఈ మిశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనం రోగ నిరోధక శక్తిని పెంచడం. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, శరీరాన్ని అంటువ్యాధులు, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. తేనె, నల్ల మిరియాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు దీనికి తోడై, శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఈ మిశ్రమం ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయ పడుతుంది.
2. మెరుగైన జీర్ణక్రియ:
జీర్ణ సంబంధిత సమస్యలకు ఈ మిశ్రమం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఉసిరిలో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. నల్ల మిరియాలలో ఉండే ‘పైపెరిన్’ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి, తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వలన అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె కడుపులోని మంటను తగ్గిస్తుంది.
3. మెటబాలిజం, బరువు నియంత్రణ :
ఉసిరి, నల్ల మిరియాలు కలిసిన ఈ మిశ్రమం శరీరంలోని జీవక్రియ (మెటబాలిజం) వేగాన్ని పెంచుతుంది. నల్ల మిరియాలు శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి. తేనెలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గాలనుకునే వారికి ఇది దోహదపడుతుంది.
4. చర్మం, జుట్టు ఆరోగ్యం:
ఉసిరిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి చర్మ కణాల పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయ పడుతుంది. అలాగే చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేసి.. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఈ మిశ్రమం ఉపయోగపడుతుంది.
5. రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం:
తేనెలో నానబెట్టిన ఉసిరి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి. రక్త నాళాలలో అడ్డంకులను తొలగించడానికి సహాయ పడుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది.
ఎలా తీసుకోవాలి ?
సాధారణంగా..ఉసిరిని చిన్న ముక్కలుగా చేసి లేదా ఉసిరి రసంలో నల్ల మిరియాల పొడి, తేనె కలిపి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు నుంచి ఉదయం పరగడుపున 3 స్పూన్ల చొప్పున, రోజుకు మూడు సార్లు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఈ సంప్రదాయ మిశ్రమాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉన్నప్పటికీ.. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలు నిపుణులను సంప్రదించిన తర్వాతే దీనిని వాడటం శ్రేయస్కరం.