విష్ణు పురాణంలో కలియగం గురించి ఎంతో వివరంగా రాశారు. ఈ కలియుగంలో అనుబంధాల కంటే డబ్బుకే ప్రాధానత్య ఇస్తారు. నైతికత అదృశ్యం అవుతుందని, ఇదొక పాపపు కాలమని ఇప్పటికే ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. విష్ణు పురాణం కూడా కలియుగం ముగింపు గురించి చెబుతోంది.
కలియుగం ముగింపు ఒక భయంకరమైన రాత్రి తో ముగిస్తుందని విష్ణు పురాణం వివరిస్తోంది. ఆ రాత్రి అన్నీ నాశనం అవుతాయని పాపాలు పరాకాష్టకు చేరుకుంటాయని వివరిస్తోంది.
విష్ణు పురాణం ప్రకారం కలియుగం చివరలో ప్రజలు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంబంధాలు, స్నేహం, గౌరవం అన్నింటినీ వదిలేస్తారు. స్వార్థపూరితంగా మారతారు. మంచి లక్షణాలున్న వ్యక్తిని గౌరవించడం మానేస్తారు. ఎవరైతే ధనవంతుడు, ఎవరికైతే ఉన్నత హోదా ఉంటుందో వారినే గౌరవిస్తారు. పేదలు ప్రతిభావంతులైన వ్యక్తులను కూడా పట్టించుకోరు. పాపం, చెడు వంటివి పరాకాష్టకు చేరుకుంటాయి.
ఒకరినొకరు చంపుకుంటూ
కలియుగం చివరి రోజుల్లో నేరాలు విపరీతంగా పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు. దొంగతనాలు, దోపిడీలు, మహిళలపై దారుణాలు అధికమైపోతాయి. తప్పు చేసిన వారు నిర్భయంగా తిరుగుతారు. చట్టం పట్ల భయం పోతుంది. సమాజంలో అరాచక శక్తులు నిండిపోతాయి. శాంతి పూర్తిగా నాశనం అయిపోతుంది.
కలియుగం చివరికి చేరిందని చెప్పే సంఘటనలే. పైన చెప్పినవన్నీ ప్రజలు జీవించేందుకే భయపడతారు. నేరాలు, హింస అధికంగా ఉంటాయి. తమ ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయపడే రోజులు వస్తాయి. సమాజంలో భయం, అరాచకం ఎక్కువైపోయి ముఖ్యంగా రాత్రిపూట విధ్వంసం జరుగుతుంది. భయం నీడలోనే ప్రతి ఒక్కరూ బ్రతకాల్సి వస్తుంది.
అంతేకాదు కలియుగం చివరలో మనుషులు ఆయుర్ధాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వారు 12 నుండి 20 సంవత్సరాలు మాత్రమే జీవించగలుగుతారు. వారి శరీరాలు కూడా చిన్నవిగా, బలహీనంగా మారిపోతాయి. ఎత్తు నాలుగు అంగుళాలకు మించి పెరగరు. ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. విష్ణు పురాణం ప్రకారం కలియుగం చివరిలో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. సూర్యుడు తీవ్రమైన వేడి కారణంగా భూమి మండిపోతూ ఉంటుంది. నదులు ఎండిపోతాయి. భయంకరమైన కరువులు వస్తాయి. భూకంపాలు, సునామీలు తరచూ వస్తూ ఉంటాయి.
చివరి రాత్రి
ఇక కలియుగంలో చివరి రాత్రి అతి భయంకరంగా చీకటిగా ఉంటుంది. ప్రజలు ఒకరినొకరు విశ్వసించుకోరు. సంబంధాలు పూర్తిగా మాయమైపోతాయి. ఆ రాత్రి చాలా పొడవుగా ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీపం వెలిగించినా కూడా కాంతి వెదజల్లదు. ప్రజలు అశాంతితో, ఆందోళనలతో నిండిపోతారు. ఆ రోజు కుండపోత వర్షం పడుతుంది. ప్రతి చోటా నీరు నిండిపోతూ ఉంటుంది. భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. బలమైన తుఫానులు వస్తాయి. ఆ రాత్రి ఎప్పుడు ముగుస్తుందా… అని ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు.
ఆ రాత్రి ప్రజలంతా తమ చివరి గంటల సమీపించాయని అర్థం చేసుకుంటారు. ఎవరూ వారిని కాపాడలేని పరిస్థితిలో ఉంటారు. శారీరకంగా, మానసికంగా బలహీనంగా మారిపోతారు. పూర్తిగా నిస్సహాయంగా ఉంటారు. ఆ చివరి రాత్రి భూమిపై ఉన్న ఆహారం మొత్తం అయిపోతుంది. భూకంపం, తుఫాను, వర్షం వంటి వాటి వల్ల ధాన్యం గిడ్డంగులు నాశనం అయిపోతాయి. నీరు కూడా దొరకదు. ప్రజలకు ఆకలితో విలవిలలాడి పోతారు. దాహంతో అల్లాడుతారు. ఒకరినొకరు దోచుకుంటారు. హింస పెరుగుతుంది. సమాజంలో శాంతి ఉండదు. ఆ రాత్రి మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుంది. భూమిపై చెడు, అరాచకం పెరిగినప్పుడే విష్ణువు కల్కి అవతారం ఎత్తుతాడని విష్ణు పురాణం చెబుతోంది.
కల్కి అవతారం
శ్రీ భాగవతం చెబుతున్న ప్రకారం కల్కి ఉత్తరప్రదేశ్ లోని సంభాల జిల్లాలో ఒక బ్రాహ్మణుడికి జన్మిస్తాడు. అతను తెల్లని గుర్రంపై స్వారీ చేసుకుని కత్తి, విల్లుతో కలియుగంలోని చెడును నాశనం చేస్తాడు. ఇక అప్పటినుంచి సత్యయుగం ప్రారంభమవుతుంది. కలియుగం అంతం జరిగిపోతుంది.