వందల ఏళ్ల క్రితం నాటి మనిషితో పోలిస్తే ఇప్పుడు మనకి వచ్చే వ్యాధుల సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా అధిక బరువు, డయాబెటిస్, హైబీపీ వంటి బారిన అధికంగా పడుతున్నాం. కానీ ఒకప్పుడు మనిషికి వీటి గురించి తెలియదు. ఎందుకంటే వారి ఆరోగ్యం.. సాంప్రదాయ బద్ధంగా, ప్రకృతితో ముడిపడి ఉండేది. భోజనం నుంచి పని వరకు అన్నీ కూడా ప్రకృతికి మేలు చేసేవే. పర్యావరణాన్ని కాపాడేవే. అలాంటి పద్ధతుల్లో శతపావళి సంప్రదాయం కూడా ఒకటి. మనుషులు పూర్వం ఆరోగ్యంగా ఉండడానికి ఇదే కారణమని చెబుతోంది ఆయుర్వేదం.
శతపావళి అంటే ఏమిటి?
శతపావళి అంటే ఇంకేదో కాదు… 100 అడుగులు వేయడం. అంటే భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడిస్తే దాన్ని శతపావళి అంటారు. మరాఠీలో సంస్కృతిలో శతపావళి అనేది ఒకప్పుడు ముఖ్యమైన భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాత్రి భోజనం తర్వాత 100 అడుగులు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా చెబుతుంది. ఒకప్పుడు మనుషులంతా నడక ద్వారానే తమ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. నడక మన ఆరోగ్యానికి చేసే మేలు ఇంత అంతా కాదు.
మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేశాక 100 అడుగులు వేయండి చాలు. అది మీలో ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రావు. చాలామందికి భోజనం చేశాక గ్యాస్టిక్ సమస్య మొదలవుతుంది. తేనుపులు వస్తూనే ఉంటాయి. అలాగే మలబద్ధకం కూడా మరుసటి రోజు కనిపించవచ్చు. తిన్న తర్వాత శతపావళిని పాటించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పొట్ట పేగులు అద్భుతంగా పనిచేస్తాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. సమస్యల నుంచి కూడా బయటపడతారు.
డయాబెటిస్
మధుమేహంతో బాధపడుతున్న షుగర్ పేషెంట్లకు రాత్రి భోజనం తర్వాత నడవడం అనేది ఎంతో ముఖ్యం. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తిన్న తర్వాత పది నిమిషాలు నడిస్తే రక్తంలో చక్కెర పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెంచుతుంది. కానీ ఎంతో మంది తిన్న తర్వాత వెంటనే నిద్ర పోవడానికి చూస్తారు. భుక్తాయాసం వల్ల అలా నిద్రపోవాలని అనిపిస్తుంది. కానీ ఓపిక చేసుకొని నడిస్తే మీకే మంచిది.
గుండె ఆరోగ్యానికి
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు లేదా గుండె సమస్యలు భవిష్యత్తులో రాకూడదు అని కోరుకునేవారు… భోజనం తర్వాత నడవడం చాలా ముఖ్యం. కేవలం 10 నిమిషాలు నడిస్తే శతపావళి పూర్తయిపోతుంది. అంటే 100 అడుగులు వేసేస్తారు. దీనివల్ల మీ రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరగవు. ఈ రెండు అదుపులో ఉంటే గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కోసమే ప్రతిరోజూ శతపావళిని పాటించండి.
శతపావళి చేసేందుకు భోజనం చేశాకే మంచి ఉత్తమ సమయమని చెప్పుకోవాలి. మీరు రాత్రి భోజనం తర్వాత పది నుండి 15 నిమిషాలు నడవండి. లేదా మీ అడుగులను లెక్క పెట్టుకోండి. వంద అడుగులు పడే వరకు నడవండి. అదే మీరు భారీ భోజనాలు తింటే మాత్రం అరగంట పాటు నడవాల్సి వస్తుంది. తేలికపాటి భోజనం తింటే పది నిమిషాలు నడిస్తే సరిపోతుంది.