food poisoning Long Term complications| వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వస్తే చాలామంది దాన్ని సాధారణ ఫుడ్ పాయిజనింగ్‌గా భావిస్తారు. కొన్ని రోజుల్లో సమస్య తగ్గిపోతుందని అనుకుంటారు. చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది. అయితే, కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్లు కడుపు సమస్యలకు మించి ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి.
కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు తగ్గిన తర్వాత కూడా కొత్త లక్షణాలు కనిపిస్తాయి. నరాలు, కిడ్నీలు, కీళ్లు లేదా జీర్ణవ్యవస్థపై దీర్ఘకాలంలో ప్రభావితం చేసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఫోర్టిస్ హాస్పిటల్‌కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ నిర్దేశ్ చౌహాన్ ప్రకారం.. విరేచనాలు ఆగిపోయినంత మాత్రాన జీర్ణవ్యవస్థ పూర్తిగా కోలుకున్నట్లు కాదు. కొంతమందిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కడుపు, ప్రేగుల పనితీరులో మార్పులు కొనసాగవచ్చు. కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడంతో మలబద్ధం లేదా విరేచనాలు రావడం. దీనివల్ల పదేపదే కడుపు నొప్పి, ఉబ్బరం, మల విసర్జనలో మార్పులు కనిపిస్తాయి. క్యాంపిలోబాక్టర్ లేదా సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల తర్వాత ఇలాంటి సమస్యలు కొందరిలో కనిపిస్తూ ఉంటాయి.
పేగుల లోపలి పొర శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కొన్ని బ్యాక్టీరియా, వాటి విషపదార్థాలు ఈ పొరను దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతో పేగులలో వాపు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలో ఇతర ఇన్‌ఫ్లమేటరీ ప్రతిస్పందనలకు కూడా దారితీస్తుంది. అయితే, ఫుడ్ పాయిజనింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమస్యలు రావు.
కొన్ని అరుదైన సందర్భాల్లో క్యాంపిలోబాక్టర్ జెజుని ఇన్ఫెక్షన్ గిల్లియన్ బారే సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. ఈ పరిస్థితిలో రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. అంటే చేతులు లేదా కాళ్లలో జలదరింపు, బలహీనత కనిపిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో నడవడం లేదా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. కడుపు సమస్య తగ్గిన తర్వాత కూడా ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.
కొన్ని రకాల ఈకోలి బ్యాక్టీరియా షిగా టాక్సిన్ అనే విషపదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి హీమోలిటిక్ యూరెమిక్ సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఈ సమస్య రక్తకణాలు, ప్లేట్‌లెట్లపై ప్రభావం చూపుతుంది. తీవ్రమైన సందర్భాల్లో కిడ్నీలకు కూడా నష్టం కలిగిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ సమయంలో రక్తంతో కూడిన విరేచనాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
సాల్మొనెల్లా, షిగెల్లా.. యెర్సీనియా వంటి ఇన్ఫెక్షన్లు కొందరిలో రియాక్టివ్ ఆర్థరైటిస్‌కు కారణం కావచ్చు. కడుపు సమస్య తగ్గిన తర్వాత కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుతు కనిపించవచ్చు. ఇలాంటి కొత్త లక్షణాలు వస్తే వైద్య సలహా తీసుకోవడం మంచిది.
Also Read: ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు.. ఈ తేదీల్లో పుట్టినవారు సున్నిత మనస్కులు
38.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వాంతులు లేదా మలంలో రక్తం కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల తల తిరగడం, మూత్రం తగ్గడం లేదా ముదురు రంగులో మూత్రం రావచ్చు. కళ్లకు మసకగా కనిపించడం, జలదరింపు లేదా అసాధారణ బలహీనత కూడా అత్యవసర హెచ్చరికలుగా భావించాలి.
Also Read: జిమ్ చేయడానికి సమయం లేదా? కేవలం ఈ 7 నిమిషాల వర్క్‌అవుట్ చేయండి చాలు
చాలామంది ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేకుండా పూర్తిగా కోలుకుంటారు. అయినప్పటికీ, సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే వాటిని సాధారణ కడుపు ఇబ్బందిగా భావించకూడదు. పదేపదే కడుపు నొప్పి, విరేచనాలు, బలహీనత లేదా కీళ్ల సమస్యలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.