Instant Peanut Chutney: మనకు ఉదయాన్నే వేడివేడి ఇడ్లీ లేదా దోశ అనగానే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి చట్నీ. ఆ కమ్మని కొబ్బరి చట్నీ లేకపోతే టిఫిన్ తిన్న ఫీలింగే రాదు. కానీ, ఒక్కోసారి ఇంట్లో కొబ్బరి చిప్ప ఉండదు, లేదా సమయానికి కొబ్బరి కొట్టే ఓపిక ఉండదు. అలాంటప్పుడు టొమాటో చట్నీ, పుదీనా చట్నీ చేసుకున్నా.. ఎక్కడో కొబ్బరి చట్నీ లోటు కనిపిస్తూనే ఉంటుంది. అయితే, అస్సలు కొబ్బరే లేకుండా, అచ్చం కొబ్బరి చట్నీలాగే కమ్మగా, చిక్కగా ఉండే ఇన్స్టంట్ చట్నీని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంటికి సడెన్‌గా చుట్టాలు వచ్చినా, ఉదయాన్నే ఆఫీసు హడావిడిలో ఉన్నా ఈ చట్నీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
వంటగదిలో కొత్త ప్రయోగాలు చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కొబ్బరి లేని లోటును తీర్చడానికి పల్లీలు (వేరుశనగ గింజలు) అద్భుతంగా పనిచేస్తాయి. పల్లీలతో చేసే చట్నీ కొబ్బరి చట్నీ లాగే చిక్కగా, క్రీమీగా ఉండటమే కాకుండా రుచిలోనూ ఏమాత్రం తీసిపోదు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఈ కమ్మని చట్నీ చేసుకోవడానికి మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే వస్తువులే సరిపోతాయి. ఇందుకోసం గుప్పెడు పల్లీలు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తాజా పెరుగు తీసుకుంటే చాలు.
Also Read: ఇంట్లోనే క్రిస్పీ వెజిటబుల్ కట్లెట్స్.. ఈవెనింగ్ స్నాక్‌గా అదిరిపోతాయి!
ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి, అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా పెరుగు వేసి మరోసారి తిప్పాలి. చట్నీ మరీ గట్టిగా అనిపిస్తే.. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చేవరకు కొద్దిగా నీళ్లు కలుపుకుంటే సరిపోతుంది.
ఏ చట్నీకైనా అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. ఈ వేడివేడి తాలింపును చట్నీలో కలుపుకుంటే ఘుమఘుమలాడే పల్లీ చట్నీ రెడీ. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ చట్నీ ఇడ్లీ, దోశల్లోకి అద్భుతంగా ఉంటుంది.
Also Read: రెడ్ సాస్ పాస్తాకు అసలైన ఇటాలియన్ రుచి రావాలంటే ఇలా చేయండి!