Ghee: వంటకాల్లో.. ఆయుర్వేదంలో నెయ్యికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. కేవలం రుచికే కాదు.. అపారమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నెయ్యి ప్రసిద్ధి చెందింది. రోజువారీ ఆహారంలో నెయ్యిని ఒక స్పూన్ మోతాదులో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని.. అంతే కాకుండా శరీరాన్ని బలోపేతం చేసుకోవచ్చని ఆయుర్వేదం సూచిస్తోంది.
1. జీర్ణవ్యవస్థకు మేలు:
నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం జీర్ణవ్యవస్థకు చాలా ముఖ్యమైంది. ఇది పేగుల గోడలను ఆరోగ్యంగా ఉంచి.. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ప్రతిరోజూ నెయ్యి తినడం వల్ల మల బద్ధక సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు సజావుగా సాగుతుంది.
2. శక్తిని పెంచుతుంది:
నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం. ఇందులో ఉండే మీడియం-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరం త్వరగా గ్రహించి శక్తిగా మారుస్తుంది. కాబట్టి.. రోజూ ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల రోజువారీ పనులకు అవసరమైన శక్తి లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు, వ్యాయామం చేసే వారికి ఇది చాలా ఉపయోగ పడుతుంది.
3. కీళ్ల ఆరోగ్యానికి కీలకం:
కీళ్లు.. ఎముకలు దృఢంగా ఉండాలంటే సరైన పోషణ అవసరం. నెయ్యిలో సహజ సిద్ధమైన లూబ్రికెంట్స్ ఉంటాయి. ఇవి కీళ్ల మధ్య రాపిడిని తగ్గించి.. కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల నొప్పులు రాకుండా.. నివారించడంలో నెయ్యి సహాయ పడుతుంది.
4. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది:
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ ఈ వంటి ముఖ్యమైన కొవ్వులో కరిగే విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయ పడతాయి.
5. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది:
నెయ్యి శరీరానికి లోపలి నుండి తేమను అందిస్తుంది . రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా.. మృదువుగా తయారవుతుంది. అంతేకాకుండా.. ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తుంది. చర్మంపై ముడతలు పడకుండా నిరోధిస్తుంది.
6. మెదడు పని తీరు:
ఆయుర్వేదం ప్రకారం.. నెయ్యి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించి.. నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
నెయ్యి ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. దానిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణులు రోజుకు ఒకటి లేదా రెండు టీస్పూన్ల (5-10 గ్రాములు) నెయ్యి మాత్రమే తీసుకోవాలని చెబుతుంటారు. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరగడానికి దారితీసే అవకాశం ఉంటుంది. నాణ్యమైన.. ఇంట్లో తయారు చేసిన లేదా దేశీయ ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది.