చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే వైద్యుని వద్దకు వెళ్లి మందులు వాడాల్సిన అవసరం లేదు. చిన్న ఇంటి చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు. తరచూ కొంతమందికి పొట్టనొప్పి వస్తూ ఇబ్బందిగా అనిపిస్తుంది. జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా అనిపించడం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని దూరం చేసుకోవచ్చు. అన్ని భారతీయ గృహాల్లో ఇంగువ కచ్చితంగా ఉంటుంది. ఇది ఘాటైన మసాలా అని చెప్పుకోవచ్చు. ఇంగువ వేస్తే పప్పుకి, సాంబార్ కి వచ్చే రుచి ఇంత అంతా కాదు.
ఇంగువను భారతీయ వంటలలో ముఖ్యంగా పప్పు, కూరల్లో వేస్తూ ఉంటారు. దీన్ని చాలా కాలంగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా ఇంగువను వినియోగిస్తారు. దీన్ని చిటికెడు వాడితే చాలు… శరీరంలో ఎన్నో సమస్యలు తగ్గుతాయని అంటారు. ముఖ్యంగా పొట్ట సమస్యలను తగ్గించడంలో ఇది ముందుంటుంది.
ఇంగువతో చిట్కాలు
ఇంగువను ఉపయోగించడానికి సులువైన మార్గం ఆ ఇంగువ పొడిని గోరువెచ్చటి నీటిలో వేసి బాగా కలిపి కరిగించాలి. ఇంగువలో సహజంగానే యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది పొట్ట ఉబ్బరాన్ని, అజీర్ణాన్ని, గ్యాస్ వల్ల కలిగే తిమ్మిరిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటితో తాగినప్పుడు పొట్ట కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
శక్తివంతమైన నివారణ మార్గాల్లో ఇంగువను అల్లంతో కలిపి తీసుకోవడం కూడా ఒకటి. అల్లంలో శోథ నిరోధక లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇంగువతో కలిపి అల్లం పేస్టును తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం, జీర్ణం వంటి సమస్యలు రావు. అల్లం పేస్టు, గోరువెచ్చని నీరు, లేదా మజ్జిగ కలిపి అందులో ఇంగువ పొడిని వేసి బాగా కలుపుకొని తాగాలి. ఇది జీర్ణ ఎంజైములను ప్రేరేపిస్తుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కడుపులో కూడా ఒత్తిడిని తగ్గించి అసౌకర్యాన్ని లేకుండా అడ్డుకుంటుంది.
నెయ్యితో కలిపి
ఇంగువను నెయ్యితో కలిపి తీసుకున్నా మంచిదే. చిటికెడు ఇంగువ పొడిని అర స్పూను నెయ్యిలో వేసి బాగా కలిపి దాన్ని తినాలి. ఇలా చేయడం వల్ల పొట్ట దగ్గర తిమ్మిరి, నొప్పి వంటివి తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థలో ఆటంకాలు కూడా రావు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read: రోజులో ఒకసారే భోజనం చెయ్యడం ఆరోగ్యానికి మంచిదేనా? బరువు తగ్గుతారా?
గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వాటికీ ప్రభావంతంగా చికిత్స చేయడంలో ఇంగువ ముందుంటుంది. వెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ఇంగువ పొడిని వేసి బాగా కలపాలి. నిమ్మకాయలు ఆల్కలైజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది అదనంగా విడుదలైన పొట్టలోని ఆమ్లాన్ని తటస్థం చేయడానికి సహాయపడుతుంది. ఇక ఇంగువ యాసిడ్ రిఫ్లెక్స్ ను తగ్గిస్తుంది. ఇవన్నీ కలిపి కడుపునొప్పిని తగ్గించడంలో ముందుంటాయి. పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.