Night Serum: మెరిసే, అందమైన చర్మం ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే ఇందు కోసం కొన్ని రకాల టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. కాంతివంతమైన చర్మం కోసం మార్కెట్ నుండి వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కొని ప్రతి రోజూ వాడుతుంటాము. వీటికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే.. మీ చర్మం యొక్క తేమను కాపాడుకోవడానికి, అంతే కాకుండా దానిని ప్రకాశవంతంగా మార్చడానికి.. మీరు తప్పకుండా ఫేస్ సీరం ఉపయోగించాలి. మార్కెట్లో అనేక బ్రాండ్ల సీరమ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు ఇంట్లోనే సీరమ్‌ను తయారు చేసుకోవచ్చు.
ఈ సీరం తయారు చేయడం చాలా సులభం. మీరు దీనిని రాత్రిపూట ముఖానికి అప్లై చేయవచ్చు. తద్వారా ఇది రాత్రిపూట మీ చర్మాన్ని రిపేర్ చేయడంలో, పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఈ అద్భుతమైన నైట్ సీరం ఇంట్లో ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నైట్ సీరం తయారీకి కావలసిన పదార్థాలు:
2 టీస్పూన్లు- బాదం నూనె
1 టీస్పూన్- కలబంద జెల్
ఒక విటమిన్- E క్యాప్యూల్స్
1 టీస్పూన్- రోజ్ వాటర్
కుంకుమ పువ్వు- కాస్త ( వీలైతే)
నైట్ సీరం ఎలా తయారు చేయాలి ?
ముందుగా, 6-8 కుంకుమపువ్వు రేకులను తీసుకొని వాటిని ఒక చెంచా రోజ్ వాటర్‌లో వేయండి. తర్వాత కనీసం 4-6 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచండి. తద్వారా అందులోని రంగు, పోషకాలు సరిగ్గా బయటకు వస్తాయి.
మరుసటి రోజు ఒక శుభ్రమైన గిన్నెలో ఒక చెంచా కలబంద జెల్ , రెండు చెంచాల బాదం నూనె కలపండి. వీటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు విటమిన్ ఇ క్యాప్సూల్‌ను పగలగొట్టి, దానికి నూనె వేసి కలపండి. ఇప్పుడు అందులో కుంకుమపువ్వు , రోజ్ వాటర్ మిశ్రమాన్ని కలపండి. అనంతరం గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి. మీరు ఈ సీరంను రెండు వారాల పాటు ఉపయోగించవచ్చు.
నైట్ సీరం ఎలా ఉపయోగించాలి ?
మొదట ఫేస్ వాష్ తో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.
తర్వాత 2-3 చుక్కల సీరం తీసుకొని ముఖం మీద అప్లై చేయండి.
అనంతరం చేతులతో పైకి వృత్తాకారంగా సీరం మసాజ్ చేయండి.
రాత్రంతా సీరం అలాగే ఉంచి.. ఉదయం గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
Also Read: అలోవెరాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మొటిమలు మాయం
నైట్ సీరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ?
నైట్ సీరం తయారీలో ఉపయోగించే కుంకుమ పువ్వు చర్మంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మానికి మెరుపును అందిస్తుంది.
బాదం నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అంతే కాకుండా పొడి, నిర్జీవమైన చర్మాన్ని తొలగిస్తుంది. డార్క్ సర్కిల్స్‌ను కూడా తగ్గిస్తుంది.
సమ్మర్‌లో అలోవెరా జెల్ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా ఇది మొటిమలను తగ్గిస్తుంది.
విటమిన్ ఇ చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని బిగుతుగా చేయడం ద్వారా ముడతలను కూడా తగ్గిస్తుంది.
రోజ్ వాటర్ మీ చర్మాన్ని టోన్ చేయడంతో పాటు దాని pH సమతుల్యతను కాపాడుతుంది. దీనివల్ల చర్మానికి తాజాదనం లభిస్తుంది.