Long Hair Tips: ఈ రోజుల్లో జుట్టు రాలడం, పలుచబడడం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, సరైన పోషకాహార లోపం వంటివి దీనికి ప్రధాన కారణాలు. అయితే.. కొన్ని సహజ పద్ధతులను పాటించడం ద్వారా జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెంచుకోవచ్చు. దీనికి ఎలాంటి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. ఇంట్లోనే దొరికే వాటితోనే మంచి ఫలితాలను పొందవచ్చు.
1. ఆరోగ్యకరమైన ఆహారం:
జుట్టు పెరుగుదల ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మీ జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తేనే అది బలంగా ఉంటుంది. దీనికోసం విటమిన్లు (ముఖ్యంగా విటమిన్ E, C), ప్రొటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
2. నూనె మసాజ్:
జుట్టుకు తల స్నానం చేసే ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం చాలా మంచిది. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆముదం వంటివి వాడొచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు నూనెను గోరువెచ్చగా చేసి తలకు మర్దన చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్ళు బలంగా మారి.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
3. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. ఒక ఉల్లిపాయను తురిమి, రసం తీసి దాన్ని తల వెంట్రుకల కుదుళ్లకు పట్టించండి. 15-20 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
4. కలబంద (అలోవెరా):
కలబంద జుట్టు పెరుగుదలకు ఒక అద్భుతమైన ఔషధం. ఇందులో ఉండే ఎంజైమ్‌లు జుట్టు కుదుళ్లను పోషించి, చుండ్రును నివారిస్తాయి. కలబంద ఆకు నుంచి జెల్‌ను తీసి, దాన్ని నేరుగా తలకు పట్టించి 20-30 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
5. కెమికల్స్ ఉత్పత్తులను వాడటం తగ్గించండి:
జుట్టును ఒత్తుగా పెంచాలంటే.. హెయిర్ డ్రయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటివి ఎక్కువగా వాడకూడదు. ఈ పరికరాల నుంచి వచ్చే వేడి జుట్టుకు హాని చేస్తుంది. అలాగే.. రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూలు, కండీషనర్లకు బదులుగా సహజమైన ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.
6. ఒత్తిడి తగ్గించుకోండి:
అధిక ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ముఖ్య కారణం. యోగా, ధ్యానం, శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.