Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రహదారులపైకి, ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
రాబోయే 2గంటల్లో పెద్దపల్లి, భూపాలపల్లి, జనగామ, కరీంనగర్, హన్మకొండ, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ALSO READ: Bank of Baroda Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు జాబ్ మీదే.. ఇదే మంచి అవకాశం
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..
భద్రాచలంలో గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటి వరకు 9 లక్షల 40వేల 345 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,85,831 ఉండగా.. ఔట్ ప్లో 4,81,194 క్యూసెక్కులుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 13.5 అడుగులకు చేరింది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ALSO READ: KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే.. ఈ ఎలక్షన్ అంతా ఓ డ్రామా: కేటీఆర్
చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు..
అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏజెన్సీలో సీలేరు, శబరి, గోదావరి నదుల్లో వరద ప్రవాహం గంట గంటకి పెరుగుతోంది. మన్యంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం శబరి నది ప్రవాహం 31.5 అడుగులకు చేరింది. ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీ- ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.