Almonds Side Effects : బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అందరికీ తెలుసు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, హైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా చక్కెరను నియంత్రించడంలో కూడా ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే.. కొన్ని సార్లు మేలు చేసే పదార్థాలు అయినా ఎక్కువగా తింటే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాదం విషయంలో కూడా ఇలాంటివి జరుగుతాయి.
బాదం ఎక్కువగా తింటే ?
1. ఖనిజాల శోషణకు ఆటంకం:
బాదంలో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. మితంగా తీసుకుంటే ఈ యాసిడ్ సురక్షితమే. కానీ.. బాదం పప్పులను ఎక్కువగా తింటే.. ఈ ఫైటిక్ యాసిడ్ మన పేగులలోని ముఖ్యమైన ఖనిజాలైన కాల్షియం, ఐరన్, జింక్ వంటి వాటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. దీని వల్ల శరీరం ఆ ఖనిజాలను పూర్తిగా శోషించుకోలేదు. దీర్ఘకాలంలో ఇది పోషకాహార లోపాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారులలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
2. ఊహించని బరువు పెరుగుదల:
బాదం పప్పులు పోషకాల పవర్‌హౌస్ అయినప్పటికీ.. వాటిలో కేలరీలు, కొవ్వు శాతం చాలా అధికంగా ఉంటుంది. సుమారు 100 గ్రాముల బాదంలో 50 గ్రాముల కొవ్వు, 570 కేలరీలకు పైగా ఉంటాయి. మీరు ఆరోగ్యకరమైనవి కదా అని రోజుకు గుప్పెడుకు మించి తింటే.. ఆ అదనపు కేలరీలు శారీరక శ్రమ ద్వారా కరగకపోతే, అవి శరీరంలో కొవ్వుగా నిల్వ ఉండి బరువు పెరగడానికి దారితీస్తాయి.
3. తీవ్రమైన జీర్ణ సమస్యలు:
బాదంలో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మంచిదే అయినప్పటికీ.. అధిక మొత్తంలో ఫైబర్‌ను తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఎక్కువ నీరు తాగకపోతే.. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం, విపరీతమైన గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
4. కిడ్నీలో రాళ్ల ప్రమాదం:
బాదం పప్పులలో సహజంగా ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే సమ్మేళనాలు. మీరు రోజుకు మరీ ఎక్కువ బాదం తిన్నట్లయితే.. శరీరంలో ఆక్సలేట్ల పరిమాణం ప్రమాదకరంగా పెరిగిపోతుంది. ఈ ఆక్సలేట్లు మూత్రపిండాలలో పేరుకుపోయి, కిడ్నీలో కాల్షియం రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీ సమస్యలు లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: యువతకు పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు.. ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు !
5. విటమిన్ ఇ అతి మోతాదు:
బాదం విటమిన్ ఇకి అద్భుతమైన మూలం. అయితే.. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ ఇ తీసుకుంటే.. అది సమస్యలను సృష్టించవచ్చు. మీరు బాదం పప్పులతో పాటు ఇతర విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాలు లేదా సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లయితే, అధిక మోతాదు కారణంగా అతిసారం, బలహీనత, తల తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
బాదంలను నిజంగానే సూపర్ ఫుడ్. వాటి నుంచి పూర్తి ప్రయోజనం పొందాలంటే.. రోజుకు 5 నుంచి 10 నానబెట్టిన బాదం గింజలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. అతిగా తినకుండా మితంగా తీసుకుంటే.. మీరు ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే పొందుతారు.