Greek Yoghurt Vs Hung Curd: ఆధునిక ఆరోగ్య జీవనశైలిలో.. పెరుగు ఉత్పత్తులకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సినవి గ్రీక్ యోగర్ట్ , హంగ్ కర్డ్. ఇవి రెండూ చూడడానికి చిక్కగా, క్రీమీగా ఉన్నా.. వాటి తయారీ విధానంలో.. పోషక విలువల్లో గణనీయమైన తేడాలు ఉంటాయి. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో.. ప్రోటీన్ శాతం దేనిలో అధికంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీ విధానంలో తేడా ?
సాధారణ పెరుగు లేదా యోగర్ట్‌ను వడకట్టడం ద్వారా ఈ రెండు ఉత్పత్తులు తయారవుతాయి.
హంగ్ కర్డ్ (దేశీ విధానం): మనం ఇంట్లో తోడు పెట్టిన పెరుగును ఒక పలుచని గుడ్డలో వేసి.. అందులోని నీరు పూర్తిగా పోయే వరకు వేలాడదీయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దీనిని సంప్రదాయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
గ్రీక్ యోగర్ట్ : దీనిని యోగర్ట్ నుంచి తయారు చేస్తారు. యోగర్ట్ తయారీకి స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్, లా క్టోబాసిల్లస్ బల్గారికస్ వంటి నిర్దిష్ట బ్యాక్టీరియా స్ట్రెయిన్‌లను ఉపయోగిస్తారు. దీనిని పారిశ్రామిక పద్ధతిలో ఎక్కువ సార్లు వడకట్టి..తయారు చేస్తారు.
పోషక విలువలు: ప్రోటీన్ శాతంలో తేడా ?
పోషక పరంగా పోల్చినప్పుడు.. ఈ రెండింటి మధ్య ముఖ్యమైన తేడా ప్రోటీన్ శాతంలోనే కనిపిస్తుంది.
ప్రోటీన్:
గ్రీక్ యోగర్ట్ లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. గ్రీక్ యోగర్ట్‌లో హంగ్ కర్డ్ కంటే దాదాపు రెట్టింపు ప్రోటీన్ ఉంటుంది.
గ్రీక్ యోగర్ట్: అధిక ప్రోటీన్ కారణంగా.. ఇది కండరాల నిర్మాణానికి , బరువు నియంత్రణకు, ఆకలిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ జీర్ణ క్రియను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది.
హంగ్ కర్డ్: ఇది కూడా మంచి ప్రోటీన్ మూలమే అయినప్పటికీ.. గ్రీక్ యోగర్ట్ లాగా అధిక సాంద్రత కలిగి ఉండదు. అయినప్పటికీ.. దీనిలో కూడా కాల్షియం, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఏది ఆరోగ్యకరమైనది?
నిజానికి.. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే. అయితే మీ ఆహార లక్ష్యాలను బట్టి ఎంపిక మారుతుంది.
Also Read: వాకింగ్‌తో గుండె జబ్బులకు చెక్.. పరిశోధనలో షాకింగ్ నిజాలు !
గ్రీక్ యోగర్ట్: మీరు అథ్లెట్ లేదా బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే.. అధిక ప్రోటీన్, తక్కువ చక్కెర కలిగిన గ్రీక్ యోగర్ట్ ఉత్తమ ఎంపిక. దీనిలో లాక్టోస్ చాలా తక్కువగా ఉంటుంది. పెరుగు ఇష్టం ఉన్నవారికి ఇది మరింత అనుకూలంగా ఉంటుంది.
హంగ్ కర్డ్: రోజువారీ పోషకాహార అవసరాలకు.. తక్కువ ధరలో, ఇంట్లోనే తయారు చేసుకోగలిగే హంగ్ కర్డ్ అద్భుతమైనది. సంప్రదాయ వంటకాలకు దీని రుచి, చిక్కదనం సరిగ్గా సరిపోతుంది. ఇది కూడా ప్రోబయోటిక్స్‌ను అందించి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
పోషక పరంగా చూస్తే.. ప్రోటీన్ అధికంగా కావాలనుకునే వారికి గ్రీక్ యోగర్ట్ అత్యుత్తమ ఎంపిక. అయితే.. రెండూ కాల్షియం, ప్రో బయోటిక్స్ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉన్నాయి. మీరు మీ బడ్జెట్, రుచి, నిర్దిష్ట ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఏదైనా ఒక దాన్ని ఎంచుకోవచ్చు.