Medak DCC President: ఆ ఇద్దరు నేతలు నిన్నటి వరకు పాలు, నీళ్ళలా ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి ఉప్పు నిప్పులా మారిందట ఆ ఇద్దరి నేతల మధ్య పరిస్థితి. ఒకే ఒక్క పోస్ట్ ఇద్దరి మధ్య వైరాన్ని పెంచేసి ఎడమొహం పెడమొహం పెట్టుకునేలా చేసిందట. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు..? చిచ్చు పెట్టినా ఆ పోస్ట్ ఏంటి..? ఈ పంచాయితీ ఇప్పుడు ఎక్కడి వరకు పోనుంది?
హస్తం పార్టీ హవా కొనసాగించిన సెగ్మెంట్
మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్ కాగా.. రెండోది నర్సాపూర్ నియోజకవర్గం. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా కొనసాగించిన సెగ్మెంట్ ఇది. గత మూడు పర్యాయాలుగా BRS ఇక్కడ విజయ పరంపర కొనసాగించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో BRS పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఆంజనేయులు గౌడ్‌ని జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఆయనే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
సునీతా లక్ష్మారెడ్డిపై పోటీ చేసి ఓడిన రాజిరెడ్డి
ఆవుల రాజిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సునీతా లక్ష్మారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తర్వాత కొన్ని రోజులకు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మహిళా నేత సుహాసిని రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సెన్ పదవి దక్కింది. దీంతో ఈ ముగ్గురు నేతలు జిల్లా కేంద్రమైన మెదక్ జిల్లాలో కాకుండా నర్సాపూర్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ముగ్గురిలో ప్రస్తుతం సుహాసిని రెడ్డికి మాత్రమే ప్రోటోకాల్ ఉంది. మిగతా ఇద్దరు నేతలు ఆంజనేయులు గౌడ్, రాజిరెడ్డి పార్టీ పదవుల్లోనే కొనసాగుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎవరి పనులు వారు చేసుకుని కలిసి మెలిసి ఉండే ఈ నేతల మధ్య మెల్లమెల్లగా విబేధాలు ఏర్పడుతున్నాయట.
అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు
మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను ప్రకటించనుంది. దీంతో అన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే ఇదే పదవి ఇప్పుడు ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజి రెడ్డి మధ్య అగ్గి రాజేసిందట. మరోసారి జిల్లా అధ్యక్ష పదవి తనకే ఇవ్వాలని ఆంజనేయులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తుంటే.. ఈ సారి తాను కూడా రేసులో ఉన్నాను అని అంటున్నారట రాజి రెడ్డి. తన పేరును కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఆయన. దీంతో నర్సాపూర్ లో రాజిరెడ్డి, ఆంజనేయులు వర్గాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందట. నర్సాపూర్‌లో పార్టీ, ప్రైవేట్ ఏ కార్యక్రమం అయినా ఈ ఇద్దరు నేతలు కలిసి వెళ్లేవారు. కానీ ఎప్పుడైతే డీసీసీ అంశం తెరపైకి వచ్చిందో ఎవరికి వారు వేర్వేరుగా వెళ్తున్నారట.
Also Read: తిరుమల శ్రీవారి ఆలయంపై గేమ్ యాప్.. సర్కారు సీరియస్
ఓడినా నార్సాపూర్‌లో పార్టీని బలోపేతం చేస్తున్నానంటున్న రాజిరెడ్డి
తాను ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని.. అందుకే ఈసారి కూడా తనకే ఈ పదవిని కేటాయించాలనేది ఆంజనేయులు వర్షన్. దీనిపై రాజిరెడ్డి వెర్షన్ మరోలా ఉందట. తాను ఓడిపోయినా నర్సాపూర్‌లో పార్టీని ముందుండి నడిపిస్తున్నానని.. ఇప్పటికే పార్టీకి బలం పెరిగిందని అంటున్నారట. డీసీసీ పదవి ఇస్తే జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేయొచ్చని రాజిరెడ్డి వాదన. మొత్తంగా నిన్న మొన్నటివరకు దోస్త్ మేరా దోస్త్ అన్న నేతలు ఇప్పుడు డీసీసీ పోస్ట్ కోసం కుస్తీపడుతున్నారట. మరి అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. డీసీసీ పదవిని ఎవరికి కట్టబెడుతుంది? దాని వల్ల ఏర్పడే కోల్డ్ వార్‌ను ఎలా చల్లారుస్తోంది? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. జిల్లాల్లో ఇద్దరు నేతలు కీలకం కావడంతో కర్ర విరగకుండా.. పాము చావకుండా.. అన్నట్టుగా వ్యవహారాన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి ఈ పదవి దక్కుతుందా? లేక మరో కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది కూడా తేలాల్సి ఉంది.
Story By Vamshi Krishna, Bigtv