బిర్యానీ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది హైదరాబాదే. మరి, అలాంటి బిర్యానీ హైదరాబాదీల ఫుడ్ ఫేవరెట్స్‌లో టాప్‌లో ఉందంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ, ఆ బిర్యానీలు తినడానికి ఎంచుకుంటున్న సమయమే కాస్త షాకిచ్చే విషయం. ఎందుకంటే.. సాధారణంగా మనం బిర్యానీ వంటి హార్డ్ ఫుడ్‌ను రాత్రి 7 లేదా 9 గంటలకు తింటే.. బాగా జీర్ణం అవుతుంది. ఇక పార్టీల్లో రాత్రి 10 గంటల వరకు ఆస్వాదింవచ్చు. కానీ, కొందరు అర్ధరాత్రిళ్లు కూడా బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుని తింటున్నారట. ముఖ్యంగా రాత్రి 12 నుంచి 2 గంటల వరకు బిర్యానీలను తింటూనే ఉంటున్నారట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్విగ్గి.
హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఫుడ్ కాదు.. ఒక ఎమోషన్. అందుకే, బయట ఫుడ్ అనగానే బిర్యానీకే ప్రాధాన్యం ఇస్తారు. ఫుడ్ డెలివరి సంస్థ స్విగ్గి (Swiggy) ఇటీవల విడుదల చేసిన 2025 డేటాను చూస్తే.. మనోళ్లకు బిర్యానీ అంటే ఎంత ప్రేమో అర్థమైపోతుంది. 2025లో హైదరాబాదులో సుమారు 175 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయట. ఇందులో 108 లక్షల ఆర్టర్లు చికెన్ బిర్యానీలే ఉన్నాయట.
బిర్యానీ తర్వాత హైదరాబాదీయులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఫుడ్.. వెజ్ దోశ, ఇడ్లీ. స్వీగ్గి ద్వారా 39.9 లక్షల మంది వెజ్ దోశను ఆర్డర్ పెట్టారట. 34 లక్షల ఆర్డర్లలతో ఇడ్లీ మూడో స్థానంలో ఉందట. 18.1 లక్షల మంది వెజ్ వడా ఆర్డర్ చేయగా.. 22.13 లక్షల మంది హైప్రోటీన్ ఆర్డర్స్ పెట్టారట. ఈవినింగ్ స్నాక్స్ కింద అంటే డైలీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు.. 6.8 లక్షల మంది చికెన్ బర్గర్లు, 5.9 లక్షల మంది చికెన్ ఫ్రై ఆర్డర్లు పెట్టారట. చికెన్ షవర్మ, వెజ్ పిజ్జా, వెజ్ పఫ్ ఉన్నాయట.
కొంతమంది పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా ఉంటారు. వారికి ఆ టైమ్‌లోనే బిర్యానీలు తినేలానే కోరికలు పుట్టుకొస్తాయి. స్విగ్గి లెక్కల ప్రకారం.. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు సుమారు 6 లక్షల మంది చికెన్ బిర్యనీలు ఆర్డర్లు పెట్టారట. కొందరు చికెన్ బర్గర్లు కూడా ఆర్డర్ పెట్టారట. హాట్ మాత్రమే కాదండోయ్.. ఆ టైమ్‌లో స్వీట్లు, కేకులు ఆర్డర్ పెట్టేవారు కూడా బాగానే ఉన్నారట. 3.3 లక్షల మంది బూందీ లడ్డులు, చాక్లెట్లు, గులాబ్ జామ్‌లు ఆర్డర్ చేశారు.
హైదరాబాద్‌లో కేవలం తెలంగాణ రుచులే కాదట.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రుచులకు కూడా బాగా డిమాండ్ ఉందట. గతంలో కంటే ఆ రాష్ట్రాల సాంప్రదాయ వంటకాల డిమాండ్ 20 శాతానికి పెరిగిందట. అంతేకాదు ఉత్తరాది, బెంగాలీ ఫుడ్స్‌ను కూడా మనోళ్లు వదలట్లేదని స్విగ్గి వెల్లడించింది. గతంతో పోల్చితే వీటి ఆర్డర్ల సంఖ్య సుమారు 14 శాతానికి పెరిగిందట.
చివరిగా.. స్విగ్గి రిపోర్టులో ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. ఒకే ఒక్క కస్టమర్.. 10 అపోలో ఫిష్, 11 పుట్ట గొడుగుల వేపుడు, 13 కాజు కోడి రోస్ట్, 42 ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్ పెట్టాడని స్విగ్గి ఫుడ్ మార్కెట్ ప్లేస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధర్థ్ భాకో వెల్లడించారు. ఏది ఏమైనా మన హైదరాబాదీలకు ఫుడ్ అంటే భలే ప్రేమ కదూ. మరి, మీరు గత ఏడాది ఏవి ఎక్కువ ఆర్డర్ పెట్టి ఉంటారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వీలైతే ఆ రికార్డును ఈ ఇయర్ బ్రేక్ చేసేయండి.
Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. శంషాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదా? తేడా ఏమిటీ?