Salt and Cancer: ఉప్పు వల్ల ఆరోగ్యం కన్నా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఉప్పును మితంగా తింటే ఎలాంటి హాని లేదు, కానీ చాలామంది రుచి కోసం అన్నింట్లోనూ ఉప్పును అధికంగా వేసుకుంటూ ఉంటారు. అలాగే చిప్స్ వంటి వాటిలో ఉప్పును అధికంగా వాడుతారు. నిల్వ పచ్చళ్లలో కూడా ఉప్పును అధికంగా వేయడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయని చెబుతారు. అలాంటివి తినడం వల్ల త్వరగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఉప్పు వల్ల వచ్చే మొదటి ప్రధాన సమస్య హైబీపీ. అందరికీ ఇది మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ హైబీపీ తనతో పాటు మరిన్ని రోగాలను భవిష్యత్తులో తీసుకొస్తుంది. ఉప్పును వీలైనంతవరకు కూరల్లో లేదా అన్నంలో ఉడికించుకొని తినాలి. అంతే తప్ప కూరలో ఉప్పు తక్కువైందని పచ్చిఉప్పును పైన జల్లి ఒకసారి కలిపేసుకుని తినేవారు. ఎంతోమంది అలా పచ్చి ఉప్పును తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఉప్పు తగ్గిన పరవాలేదు, నాలికకు చప్పగా అనిపించినా పర్వాలేదు. మీ శరీరాన్ని కాపాడుకోవడం కోసం అలా చప్పగా ఉన్న ఆహారాన్ని కూడా కొన్నిసార్లు తినాల్సిందే, లేకుంటే మీ ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం.
ఏ క్యాన్సర్ వస్తుంది?
ఉప్పు వల్ల హైబీపీ వస్తుంది కదా హైబీపీకి రోజుకో టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా… అని చెప్పుకునే వారు కూడా ఎక్కువే. ఇదే కాదు తరచూ మీరు ఉప్పు అధికంగా తింటే భవిష్యత్తులో జీర్ణాశయ క్యాన్సర్ వచ్చి అవకాశం పెరుగుతుందని ఒక తాజా అధ్యయనం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందికి వస్తున్న క్యాన్సర్లలో జీర్ణాశయ క్యాన్సర్ ఐదవ స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలుసుకోవడం కోసం ఎన్నో అధ్యయనాలు చేశారు. ఆ అధ్యయనంలో ఉప్పు కూడా కారణమేనని తేలింది.
భోజనం తింటున్నప్పుడు బిర్యానీలో లేదా కూరలో, పెరుగన్నంలో ఉప్పు సరిపోకపోతే వెంటనే పచ్చి ఉప్పును కలిపి తినేస్తూ ఉంటారు. ఇలా తినడం వల్లే జీర్ణాశయ క్యాన్సర్ లేదా పొట్ట క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా పచ్చి ఉప్పు కలుపుకుని తినే వారిలో 41 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గుర్తిస్తున్నారు. జీర్ణాశయంలోపలం ఒక లైనింగ్ ఉంటుంది. అది జిగురుగా ఉండే పొర. ఆ పొరను ఈ ఉప్పు దెబ్బతీస్తుంది. దీనివల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్ బారిన పడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ పుండ్లుగా మారి క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందంటే ఆయుష్షు సగానికి పడిపోతుంది. సరైనా చికిత్స తీసుకోకపోతే బతకడం చాలా కష్టం.