Karimnagar: రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాలు సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. కేవలం డబ్బు నష్టమే కాదు, కొందరి ప్రాణాల మీదికి కూడా తెస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. సైబర్ మోసగాళ్ల నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫేక్ కాల్, ఓ తండ్రిని తీవ్ర ఆందోళనకు గురిచేసి ఆసుపత్రి పాలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లికి చెందిన మాసాడి లక్ష్మణ్ రావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాలో ఉంటున్నాడు.
Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సీఎం రేవంత్ కీలక సమావేశం
కొద్ది నిమిషాల క్రితం, లక్ష్మణ్ రావు తన కొడుకుతో అమెరికా నుండి ఫోన్‌లో మాట్లాడారు. ఆ కాల్ ముగిసిన అరగంటకే, ఆయనకు పోలీస్ డీపీ (ప్రొఫైల్ ఫోటో) ఉన్న వాట్సాప్ నంబర్ నుండి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు, “నీ కొడుకును అరెస్ట్ చేశాం. ఒక నేరంలో మా కస్టడీలో ఉన్నాడు. వెంటనే రూ. 9 లక్షలు చెల్లిస్తే విడిచిపెడతాం” అని బెదిరించారు.
లక్ష్మణ్ రావుకు నమ్మకం కలిగించడానికి, సైబర్ నేరగాళ్లు మరో దారుణానికి ఒడిగట్టారు. “కావాలంటే నీ కొడుకుతో మాట్లాడు” అని చెప్పి, ఏఐ టెక్నాలజీ ద్వారా అతని కొడుకు గొంతును మిమిక్రీ చేస్తూ మాట్లాడించారు. అయితే, అనుమానం వచ్చిన లక్ష్మణ్ రావు ఇది సైబర్ నేరగాళ్ల పనే అని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.
అయితే, పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న దారిలో ఆయన మనసులో తీవ్ర ఆందోళన మొదలైంది. “ఒకవేళ అది ఫేక్ కాల్ కాకపోతే? నిజంగానే తన కుమారుడు ఏదైనా కేసులో ఇరుక్కున్నాడా?” అనే సందేహం, భయం ఆయన్ను కుంగదీశాయి. ఈ తీవ్ర ఒత్తిడితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న లక్ష్మణ్ రావు, అక్కడే బీపీ (రక్తపోటు) ఒక్కసారిగా పెరిగి కుప్పకూలిపోయారు.
అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మణ్ రావు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన బంధువులు తెలిపారు. డబ్బులు పోగొట్టుకోకపోయినా, సైబర్ నేరగాళ్ల మోసపు కాల్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తేవడం స్థానికంగా కలకలం రేపింది.