గూగుల్ మ్యాప్స్ ను ప్రతి నెలా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. కంపెనీ సైతం ఎప్పటికప్పుడు మరింత ఈజీగా, సురక్షితంగా ప్రయాణాలు చేసేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే ఒక క్రేజీ ఫీచర్ ను పరిచయం చేసింది. ‘లైవ్ లేన్ గైడెన్స్’ పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. AI సపోర్ట్ తో ఇది పని చేస్తుంది. మొదటిసారిగా, గూగుల్ మ్యాప్స్ డ్రైవర్ లాగానే రోడ్డు లేన్లను పర్యవేక్షించనుంది. ఈ కొత్త ఫీచర్ డ్రైవర్లకు రియల్ టైమ్ నావిగేషన్ లో సాయం అందిస్తుంది. ఇంతకీ ఎలా పని చేస్తుంది? ఉపయోగాలు ఏంటి? అనేది పూర్తిగా చూద్దాం..
భారత్ లో డ్రైవింగ్ అనేది లెఫ్ట్ లేన్ లో కొనసాగుతుంది. అయితే, మీరు కుడివైపుకు వెళ్లాలని ఉంటే.. లైవ్ లేన్ గైడెన్స్ లో సిస్టమ్ మీరు లేన్లను మార్చాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. అందుకు కీలక సూచనలు ఆడియో, విజువల్ సిగ్నల్స్ ను అందిస్తుంది. దారిలో వెళ్తుండగా ఎగ్జిట్ వివరాలను కూడా సూచిస్తుంది. ట్రాఫిక్ లో ఎలా ముందుకు వెళ్లాలి? అనే విషయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం అందిస్తుంది. చివరి నిమిషంలో తొందరపడకుండా లేన్లను మారడాన్ని సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా డ్రైవింగ్ సమయంలో అత్యంత సేఫ్ గా ఉండవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని కొసాగించవచ్చు.
గూగుల్ తాజాగా తన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. GIF వీడియోతో ఇది ఎలా పనిచేస్తుందో చూపించింది. ఈ ఫీచర్ లేన్ గుర్తులు, హైవే ఇండికేషన్స్ చూడటానికి కారు ముందు కెమెరాను ఉపయోగిస్తుంది. కారు రోడ్డుపై ఎక్కడ ఉండాలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ రియల్ టైమ్ విజువల్ సమాచారం వెంటనే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వ్యవస్థతతో అనుసంధానించబడి డ్రైవర్ కు అవసరం అయిన అన్ని వివరాలకు క్లియర్ గా అందిస్తుంది. సేఫ్ గా ప్రయాణం చేసేలా సాయపడుతుంది.
ఈ AI ఆధారిత లైవ్ లేన్ గైడెన్స్ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలో టెస్ట్ రన్ నడుస్తోంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కొద్ది నెలల్లోనే స్వీడన్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. భారత్ లో లాంచ్ తేదీకి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఫీచర్ హైవే, ఎక్స్ ప్రెస్ వే డ్రైవింగ్ కు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, సిటీ లోపల డ్రైవింగ్ అనేది దట్టమైన పొగమంచు లాంటి సమయంలో కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో గూగుల్ మ్యాప్స్ కూడా అంత పక్కా సమాచారం అందించదు. అవసరమైన సూచనలు చేయడంలోనూ ఇబ్బంది పడుతుంది.
Read Also: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్ పట్టేయండి!