Gudivada Amarnath: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్లేదు అనేలా ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలను అడిగితే మా చేతుల్లో లాటీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. కల్తీ మద్యం అంశంలో నకిలీ ఎవిడెన్స్ తో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
‘కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. వైసీపీ విద్యార్థి నాయకులను కూడా ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంధి. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. వైసీపీ విద్యార్థి సంఘం నాయకుడు కొండా రెడ్డి ఏ తప్పు చెయ్యలేదని వారి తల్లితండ్రులు చెప్తున్నారు. తప్పు చేస్తే ఏ శిక్షకైనా కొండా రెడ్డి సిద్ధమని.. ఏ టెస్టుకైనా సిద్ధమని వారు చెప్తున్నారు’ – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
కొండా రెడ్డిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు ఆయనపై చెయ్యి చేసుకున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2వ తేదీ ఉదయం 7:10 నిమిషాలకు కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారన్నారు. కొండా రెడ్డి అరెస్ట్ సమయంలో ఎందుకు వీడియో రికార్డ్ చేసి బయటకు ఇచ్చారని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశామని పోలీసులు ఎందుకు చెప్పారని నిలదీశారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం పట్టుబడితే, ఉదయం 11 : 30 గంటలకు టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో ఎలా పెట్టారని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ల దగ్గర టైమ్ మిషన్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
Also Read: Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి
టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా రెడ్డిని అదుపులోకి తీసుకున్నది ఎంవీపీ పీఎస్ పరిధిలో అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కొండారెడ్డి బైక్ 14 కి.మీ అధికంగా తిరిగిందని, ఎందుకు తిప్పారని ప్రశ్నించారు. పోలీసులు ప్లాన్ ప్రకారమే కొండా రెడ్డిని అరెస్ట్ చేశారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.