జుట్టు నెరిసిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా పాతికేళ్లకే జుట్టు తెల్లగా మారి రంగులు వేసుకొని మేనేజ్ చేస్తున్నారు. మీ పిల్లలకి అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ముందు నుంచే పది రకాల సూపర్ ఫుడ్స్ ను ప్రతిరోజూ తినిపించండి. ఇవి జుట్టు నెరవకుండా కాపాడతాయి. మన చర్మం, జుట్టు రంగును ప్రభావితం చేసేది మెలనిన్ అని పిలిచే వర్ణ ద్రవ్యం. ఎప్పుడైతే దీని ఉత్పత్తి తగ్గిపోతుందో వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ఒత్తిడి కారణంగా కూడా ఇలా జరగొచ్చు. అలాగే ఆక్సీకరణ నష్టం కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే ధూమపానం, మద్యపానం వంటి జీవనశైలి అలవాట్ల వల్ల కూడా ఇది జరుగుతుంది. కాబట్టి పిల్లల జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను వారికి తినిపించండి.
పాలకూర
మీ పిల్లలు తినే ఆహారంలో కచ్చితంగా పాలకూర ఉండేలా చూసుకోండి. ఇది హెయిర్ ఫోలికల్స్ కు సరైన ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది. జుట్టు రంగును నిర్వహించడంలో సహాయపడుతుంది. త్వరగా జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది.
ఉసిరికాయ
శీతాకాలంలో దొరికే వాటిలో ఇవి కూడా ముఖ్యమైనవి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు తెల్లబడకుండా, మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది.
వాల్ నట్స్
ఈ నట్స్ లో బయోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు కణజాలాలను బలోపేతం చేసి సహజమైన రంగును కాపాడేందుకు సహాయపడుతుంది.
నువ్వులు
నువ్వులు సూపర్ ఫుడ్ అని చెప్పుకోవాలి. వీటిలో ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. మెలనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. జుట్టు సహజమైన రంగు అయినా నలుపును కాపాడేందుకు సహకరిస్తాయి.
కరివేపాకులు
కరివేపాకులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి అధికంగా ఉంటాయి. కరివేపాకులను తినడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. జుట్టు నెరసిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
చిలగడ దుంపలు
శీతాకాలంలో అధికంగా దొరికే దుంపల్లో చిలగడ దుంపలు కూడా ఒకటి. బీటా కెరాటిన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ ఏ గా మారుతుంది. జుట్టు సహజమైన రంగుని, ప్రకాశాన్ని కాపాడే శక్తి చిలగడ దుంపలకు ఉంది. ఇది జుట్టు పైన మాడుఫై ఆరోగ్యకరమైన సెబమ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
క్యారెట్లు
క్యారెట్లలో బీటా కెరాటిన్ అధికంగా ఉంటుంది. అంటే విటమిన్ ఏ శరీరానికి అందిస్తుంది. కాబట్టి జుట్టు నెరిసే అవకాశం క్యారెట్ల వల్ల తగ్గుతుంది.
బాదంపప్పులు
బాదంపప్పులో బయోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కెరాటిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. జుట్టు సహజమైన రంగును కాపాడుతుంది.
బీన్స్
బీన్స్ వంటి కాయ ధాన్యాలను తరచూ తినాల్సిన అవసరం ఉంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మెలనిన్ వంటి కీలకమైన ప్రోటీన్ ఉత్పత్తి కావడానికి సహకరిస్తుంది. ఐరన్, జింక్ వంటి వాటిని కూడా అందిస్తుంది.
గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
బెర్రీ పండ్లు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీ జాతి పండ్లను తినడం చాలా అవసరం. ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
Also Read: రోజు రోజుకు జుట్టు పలచబడుతోందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్